దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి, వారి బతుకుల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందన్నారు.
దీపాల వెలుగులతో ఇళ్లను, పరిసరాలను అలంకరించుకుని రాష్ట్ర ప్రజలంతా ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీపావళి కాంతులు ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
పండుగ సంబరాల వేళ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, కాలుష్యానికి తావులేకుండా, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, పెద్దలు అందరూ సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.







