ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తపై లైంగిక ఆరోపణలు.. కోర్టులో ఊరట.. రూ.53.5 కోట్ల పరిహారం!
ఒక్క ఆరోపణ.. ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతలా మార్చేయగలదు? చేతిలో మంచి ఉద్యోగం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, భవిష్యత్తులో నోబెల్ బహుమతి అందుకునే అవకాశాలు ఉన్నా.. ఒక్క వివాదంతో అన్నీ కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అమెరికాలోని MITలో స్టార్ సైంటిస్ట్ గా వెలిగిన డేవిడ్ సబాటిని జీవితం ఇలాగే తలకిందులైంది. ఉద్యోగం పోయింది.. మరో యూనివర్సిటీలో అవకాశం రాలేదు.. చివరికి అమెరికాను వదిలి చెక్ రిపబ్లిక్కు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు అదే వివాదంపై కోర్టులో జరిగిన పోరాటంలో ఆయనకు రూ.53.5 కోట్ల పరిహారం దక్కింది. ఒకప్పుడు తనను కెరీర్‌కు దూరం చేసిన వివాదమే ఇప్పుడు ఆయనకు భారీ న్యాయపరమైన విజయాన్ని తెచ్చిపెట్టింది! ఆ వివాదం ఏమిటి, అసలేం జరిగింది
నోబెల్ రేసులో ఉంటాడనుకున్న వ్యక్తి.. ఒక్కసారిగా వివాదాల్లోకి!
డాక్టర్ డేవిడ్ సబాటిని పేరు శాస్త్రీయ పరిశోధనా రంగంలో ఒకప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వినిపించేది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో ప్రముఖ జీవశాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన, కణాల పెరుగుదల (Cell Growth), జీవక్రియ (Metabolism) రంగాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో భవిష్యత్తులో నోబెల్ బహుమతి అందుకునే అవకాశం ఉన్న శాస్త్రవేత్తగా కూడా భావించేవారు.
అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో 2021లో ఆయనపై లైంగిక వేధింపులు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. తనకంటే జూనియర్ హోదాలో పనిచేసిన సహోద్యోగి డాక్టర్ క్రిస్టిన్ నౌస్తో సబాటినికి సంబంధం ఉండేది. అయితే, ఆ సంబంధం వెనుక అధికార దుర్వినియోగం ఉందని నౌస్ ఆరోపించారు. తనకున్న ఉన్నత స్థానాన్ని ఉపయోగించుకుని లైంగిక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలు బయటకు రావడంతో సబాటిని చుట్టూ వివాదం మొదలైంది. MITతో పాటు వైట్‌హెడ్ ఇన్స్టిట్యూట్, హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా అంతర్గత విచారణలు చేపట్టాయి. ఈ పరిణామాల మధ్య ఆయన తన ప్రొఫెసర్ పదవిని, ప్రయోగశాలకు సంబంధించిన అవకాశాలను, ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఉన్న అనుబంధాలను కోల్పోయారు. ఒక్కప్పుడు పరిశోధనలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వ్యక్తి.. ఇప్పుడు ఆరోపణలతో వార్తల్లో నిలిచారు.
‘మా సంబంధం పరస్పర అంగీకారంతోనే జరిగింది’.. సబాటిని వాదన!
తనపై వచ్చిన ఆరోపణలను సబాటిని మొదటి నుంచీ ఖండిస్తూ వచ్చారు. క్రిస్టిన్ నౌస్తో తనకు ఉన్న సంబంధం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే కొనసాగిందని, అందులో ఎలాంటి బలవంతం లేదని వాదించారు. ఆ సంబంధం కూడా స్నేహపూర్వకంగానే ముగిసిందని పేర్కొన్నారు. అయితే ఈ వివాదం అప్పటికే ఆయన వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపించింది.
తాజాగా జరిగిన పరువు నష్టం కేసు విచారణలో సబాటిని తరఫు న్యాయవాదులు కొన్ని ప్రైవేట్ సందేశాలను కోర్టు ముందుంచారు. వాటిలో నౌస్ ‘hetoo’ అనే పదాన్ని ఉపయోగిస్తూ సరదాగా వ్యాఖ్యానించిన సందర్భాలను ప్రస్తావించారు. ఈ సందేశాలను చూపిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు కార్యాలయంలో జరిగిన అధికార దుర్వినియోగం కంటే వ్యక్తిగత విభేదాలు, వృత్తిపరమైన పోటీ నేపథ్యంలో వచ్చాయని సబాటిని తరఫు న్యాయవాదులు వాదించారు.
అమెరికాలో ఉద్యోగం దొరకక.. యూరప్‌కు వెళ్లిపోయిన శాస్త్రవేత్త!
ఈ వివాదం సబాటిని కెరీర్‌పై ఎంతటి ప్రభావం చూపిందంటే.. అమెరికాలో మరో యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించడం కూడా కష్టంగా మారింది. 2022లో న్యూయార్క్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన నియామకంపై విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు.
ఒకప్పుడు ప్రపంచస్థాయి పరిశోధనలు చేసిన వ్యక్తి.. ఇప్పుడు తన సొంత దేశంలోనే పరిశోధనలు కొనసాగించేందుకు అవకాశం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి అమెరికాను విడిచి యూరప్‌కు వెళ్లిపోయారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ బయోకెమిస్ట్రీలో కొత్త ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు. హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మన్ సహా పలువురు దాతల నుంచి అందిన ఆర్థిక సహకారంతో మళ్లీ పరిశోధనలు ప్రారంభించారు.
కోర్టులో ఏకగ్రీవ తీర్పు.. రూ.53.5 కోట్ల పరిహారం!
ఇన్నాళ్లూ ఆరోపణల నీడలో కొనసాగిన సబాటిని జీవితంలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. తనపై తప్పుడు ఆరోపణలు చేసి పరువు తీశారంటూ మాజీ సహోద్యోగి క్రిస్టిన్ నౌస్పై ఆయన దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బోస్టన్ జ్యూరీ సబాటినికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
సఫోల్క్ కౌంటీ సుపీరియర్ కోర్టులో జరిగిన విచారణలో జ్యూరీ ఏకగ్రీవంగా సబాటినికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆయనకు రూ.53.5 కోట్లకు పైగా (6 మిలియన్ డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు, నౌస్ దాఖలు చేసిన ప్రతివాదనలను కూడా జ్యూరీ తిరస్కరించింది. సబాటిని తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ప్రతీకార చర్యలకు పాల్పడ్డారని నిర్ధారించే వాదనలను అంగీకరించలేదు.
ఈ తీర్పుపై స్పందించిన సబాటిని.. గత కొన్నేళ్లుగా తన జీవితం ఒక పీడకలలా మారిపోయిందని చెప్పారు. ఈ వివాదం తన సాధారణ జీవితాన్ని, శాస్త్రీయ ప్రతిష్ఠను పూర్తిగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చిన తీర్పుతో తన పేరును, ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టుకునే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కథ ఇంకా ముగియలేదు.. అప్పీల్‌కు సిద్ధమైన క్రిస్టిన్ నౌస్!
అయితే జ్యూరీ నిర్ణయంపై క్రిస్టిన్ నౌస్ తరఫు న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పును పైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. అకడమిక్ రంగంలో అధికార హోదాలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు చేసే మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ కేసు మరోసారి బయటపెట్టిందని వారు వాదిస్తున్నారు.
ఒకవైపు రూ.53.5 కోట్ల పరిహారం గెలుచుకున్న సబాటిని.. మరోవైపు తీర్పును సవాలు చేసేందుకు సిద్ధమైన నౌస్.. ఇలా ఈ వివాదం మరో న్యాయపోరాటానికి దారితీసేలా కనిపిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







