కేరళ నర్సుల జీవితాల్లో విషాదం: ఇంట్లో ఉంటే రూ.20 వేలు.. బయటకు వెళ్లాలంటే రూ.20 లక్షలు!
రాత్రి 2 గంటలు.
ఆసుపత్రి కారిడార్‌లో ఎమర్జెన్సీ అలారం మోగుతోంది. ఐసీయూ తలుపులు తెరుచుకుంటున్నాయి.
ఒక బెడ్‌పై పసికందు.. మరోవైపు రక్తస్రావంతో ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్. చేతిలో మందుల ట్రే పట్టుకుని ఓ యువతి అటూ ఇటూ పరుగులు పెడుతోంది. కళ్లలో నిద్ర లేదు. కాళ్లకు విశ్రాంతి లేదు. ఒంట్లో శక్తి లేదు. అయినా ఆగే పరిస్థితి లేదు. చివరకు తెల్లవారుజామున షిఫ్ట్ ముగుస్తుంది. ఆసుపత్రి బయటకు వచ్చిన ఆమె ఆకాశం వైపు చూస్తుంది. మరో రోజు గడిచిపోయింది. కానీ తన జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎప్పుడో ఒకరోజు ఈ ఆసుపత్రి గేటు దాటి మరో దేశానికి వెళ్లాలని ఆమెకు ఓ కల. ఆ కల కోసం ఇప్పటికే చాలా సమయం, శక్తి కోల్పోయింది. ఇంకా ఎంత కోల్పోవాలో ఆమెకే తెలియదు!
ఆమె కథ ఒక్కరిదేనా? లేక వేలాది మంది జీవితాల్లో నడుస్తున్న మౌన పోరాటమా?
విదేశీ కలతో మొదలైన ప్రయాణం.. ఆసుపత్రిలోనే ఆగిపోయిన జీవితం!
నర్సింగ్ చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరిన యువతులకు మొదట్లో ఎన్నో ఆశలు ఉంటాయి. మంచి ఆసుపత్రిలో పనిచేయాలి, అనుభవం సంపాదించుకోవాలి, కుటుంబానికి అండగా నిలవాలి.. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి స్థిరపడాలి. కానీ ఈ ప్రయాణం బయటకు కనిపించినంత సులభంగా ఉండటం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎదురవుతున్న పని ఒత్తిడి, తక్కువ జీతాలు చాలామంది నర్సులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత కారణంగా ఒకరిపై ఎక్కువ బాధ్యతలు పడుతున్నాయి. వెంటిలేటర్‌పై ఉన్న రోగులను చూసుకోవడం నుంచి అత్యవసర మందుల కోసం పరుగులు పెట్టడం వరకు నర్సులపై పని భారం పెరుగుతోంది. షిఫ్ట్ సమయాలు దాటినా విధులు ముగియని పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాత్రి డ్యూటీలు, సరైన విశ్రాంతి లేకపోవడం, తక్కువ వేతనాలు.. ఇవన్నీ వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తున్నాయి. చివరకు ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి కూడా వస్తోంది.
కానీ ఉద్యోగం వదిలేసి సొంతూరికి వెళ్లిపోతే సమస్యలు పరిష్కారమవుతున్నాయా? అదీ లేదు. ఎందుకంటే చాలామంది నర్సుల ముందున్న అసలు లక్ష్యం విదేశీ ఉద్యోగమే.
విదేశాలకు వెళ్లాలంటే ముందు ఇక్కడే రెండేళ్లు కష్టపడాలి!
యూకే, ఐర్లాండ్, కెనడా వంటి దేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ మెరుగైన జీతాలు, పని పరిస్థితులు ఉంటాయనే ఆశతో కేరళకు చెందిన చాలామంది నర్సులు విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే నర్సింగ్ డిగ్రీ ఒక్కటే సరిపోదు. కనీసం ఒకటి నుంచి రెండేళ్ల పని అనుభవం కూడా అవసరమవుతోంది.
దీంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారు ముందుగా భారత్‌లోని ఆసుపత్రుల్లో పనిచేయక తప్పడం లేదు. కానీ ఇక్కడే వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. తక్కువ జీతాలకు ఎక్కువ గంటలు పనిచేయాలి. రోగుల సంఖ్యకు సరిపడా నర్సులు లేకపోయినా బాధ్యతలు మాత్రం తగ్గవు. విదేశీ ఉద్యోగానికి అవసరమైన అనుభవం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఈ పరిస్థితులను భరిస్తున్నారు.
గొంతెత్తితే యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు!
నర్సుల సమస్య కేవలం జీతాల దగ్గరే ఆగిపోవడం లేదు. పని గంటలు, సిబ్బంది కొరత, ఉద్యోగ భద్రత వంటి అంశాలపైనా అసంతృప్తి పెరుగుతోంది. తమ హక్కుల కోసం నిరసనలు చేపట్టినా, యూనియన్లుగా ఏర్పడి సమస్యలను ప్రశ్నించినా యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో యూనియన్ కార్యకలాపాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీంతో నర్సులు తమ సమస్యలను బహిరంగంగా చెప్పుకోవడానికి కూడా వెనుకాడాల్సి వస్తోంది. ఉద్యోగం కావాలి కాబట్టి పని చేయాలి. విదేశాలకు వెళ్లాలంటే అనుభవం కావాలి కాబట్టి ఇక్కడే కొనసాగాలి. కానీ పనిచేసే చోట సరైన వేతనం, గౌరవం, భద్రత లేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు.
విదేశీ ఉద్యోగం పేరుతో రూ.20 లక్షల వసూళ్లు!
ఇక్కడ మరో పెద్ద సమస్య నర్సింగ్ రిక్రూట్మెంట్ రంగంలో కనిపిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు అనధికారిక ఏజెంట్లు భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్లు కొన్ని సందర్భాల్లో రూ.20 లక్షల వరకు చేరుతున్నాయి. విదేశీ ఉద్యోగం కోసం ఇప్పటికే ఎన్నో కష్టాలు పడిన నర్సులకు ఇది మరో ఆర్థిక భారంగా మారుతోంది.ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి?
కేరళ నుంచి విదేశాలకు వెళ్లే నర్సులు తగ్గుతున్నారు!
ఒకప్పుడు కేరళ నర్సులకు విదేశాల్లో మంచి గుర్తింపు ఉండేది. పెద్ద సంఖ్యలో నర్సులు యూరప్, గల్ఫ్ దేశాలు, ఉత్తర అమెరికా వైపు వెళ్లేవారు. విదేశీ ఉద్యోగాల ద్వారా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పాటు కేరళలో నర్సింగ్ వృత్తికి కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వలసల సంఖ్య తగ్గుతోంది. గత కొన్నేళ్లలో కేరళ నుంచి విదేశాలకు వెళ్లే నర్సుల సంఖ్య మూడో వంతుకు పైగా పడిపోయింది.
ఇదే సమయంలో భారత ప్రభుత్వం సేవల ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో దేశ సేవల ఎగుమతులు జీడీపీలో 10 శాతానికి చేరుకున్నాయి. ఇందులో సాఫ్ట్వేర్ సేవల వాటా 40 శాతం కాగా, కన్సల్టింగ్ సేవల వాటా 18.3 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ నైపుణ్యానికి డిమాండ్ పెరుగుతున్నా, నర్సింగ్ రంగంలో మాత్రం పని పరిస్థితులు, వేతనాలు మెరుగుపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







