అమెరికా ముందుకు 7 షరతులు.. పాటిస్తేనే చర్చలంటున్న ఇరాన్..!
అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిశాయి. ఇక ఇరాన్ పై దాడులే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాడులకు సంబంధించిన మిషన్ పై ట్రంప్.. అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇలాంటి కీలక తరుణంలో ఇరాన్.. ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు శాంతి సందేశం పంపింది. అయితే ఇందులో ఏడు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షరతులు పాటిస్తేనే చర్చలని తేల్చి చెప్పింది.
ఇరాన్‌ను ‘నాశనం చేస్తామని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్ పంపిన ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తోందని, అయితే ప్రతిపాదనలోని వివరాలను వెల్లడించడానికి అమెరికన్ ఉన్నతాధికారులు నిరాకరించారు. మరోవైపు షరతుల అంశాన్ని ఇరాన్ భద్రతా అధికారి మొహసెన్ రెజాయీ ధృవీకరించారు. “మేం అమెరికా ముందు ఏడు షరతులు ఉంచాం. అవి నెరవేర్చే వరకు హర్మూజ్ జలసంధిని తెరవబోం, చర్చలు కూడా జరపం” అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్ ఏడు షరతులు ..
లెబనాన్ సహా తమపై అన్ని రకాల శత్రుత్వాలను అమెరికా నిలిపివేయడం, ఇరాన్ ఓడరేవులపై విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, అన్ని ఆర్థిక ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయడం, పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని తగ్గించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం, తమ భూభాగంపై దాడులను ఆపడం వంటివి ఈ షరతులలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఎలాంటి చర్చలు మొదలైనా అందులో అణు అంశాలే ప్రధానంగా ఉండాలని వాషింగ్టన్ పట్టుబడుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేయడంతో ఈ ఘర్షణ మొదలైంది. దీనికి ప్రతిగా ఇరాన్.. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. ఈ వివాదం లెబనాన్‌కు కూడా పాకింది. అక్కడ ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఇటీవల యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలపై దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం మళ్లీ రాజుకుంటుందేమోనన్న భయాల మధ్య, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.







