ఫ్యూచర్‌సిటీ కేంద్రంగా ‘జైపాల్‌రెడ్డి జిల్లా’!?
తెలంగాణ రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో మరో కీలక మార్పునకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి స్మారకార్థం ఆయన పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్‌సిటీ’ని కేంద్రంగా చేసుకుని ఈ సరికొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్‌సిటీ పేరిట నాలుగు పోలీసు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. ఇదే తరహాలో నాలుగు కమిషనరేట్ల పరిధులనే నాలుగు జిల్లాలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన అధికార వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లో ఇప్పటికే మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలోకి వచ్చే ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్, కొత్తూరు, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాలతో పాటు జైపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాడ్గుల కూడా ఈ పరిధిలోనే ఉండటం తాజా ప్రతిపాదనకు ప్రధాన కారణంగా మారింది.
ఇవి కూడా చదవండి
ప్రతిపాదిత జైపాల్‌రెడ్డి జిల్లా పరిధిలోకి దాదాపు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పరిసర ప్రాంతాలను చేర్చేలా కసరత్తు సాగుతోంది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండే అవకాశం ఉంది. హయత్‌నగర్ ప్రాంతంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అవతల ఉన్న కొత్తూరు, పెద్దషాపూర్ తదితర ప్రాంతాలను ఇందులో కలపనున్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో మహేశ్వరం నుంచి 28, కందుకూరు నుంచి 9 గ్రామాలు చేర్చగా, మహేశ్వరం మండలం మొత్తాన్ని ఇందులో కలపాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. శంషాబాద్ పరిధిలోని పెద్దషాపూర్ ను కొత్త మండల కేంద్రంగా మార్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మార్పులతో రంగారెడ్డి జిల్లా సరిహద్దులు కూడా మారనున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిని రంగారెడ్డి జిల్లాగా కొనసాగిస్తూ, మిగిలిన దక్షిణ, ఆగ్నేయ మండలాలను ఫ్యూచర్‌సిటీ కేంద్రంగా ప్రతిపాదిత కొత్త జిల్లాలో కలిపే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల పాటు సేవలందించి, పార్లమెంటేరియన్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జైపాల్‌రెడ్డి పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జైపాల్‌రెడ్డితో వ్యక్తిగత, కుటుంబ అనుబంధం ఉండటంతో పాటు, ఆయన సేవలకు సముచిత గౌరవం దక్కాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముందడుగు వేస్తోంది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో విశేష ప్రభావం చూపిన నేత కావడం వల్ల స్థానిక ప్రజల్లోనూ ఈ ప్రతిపాదన పట్ల ఆసక్తి నెలకొంది.
ఈ ప్రతిపాదనలు వేగవంతంగా సాగుతున్నప్పటికీ, కొత్త జిల్లా ఆవిర్భావానికి కొంత సమయం పట్టనుంది. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ కొనసాగుతుండటంతో 2027 మార్చి 31 వరకు ఎలాంటి పరిపాలనా, రెవెన్యూ సరిహద్దులను మార్చడానికి నిబంధనలు అంగీకరించవు. ఈ గడువు ముగిసిన వెంటనే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ కోసం ప్రత్యేక జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించి, అందిన వినతులపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కమిషన్ సిఫార్సుల అనంతరం తుది నోటిఫికేషన్ వెలువడనుంది.







