‘రామాయణ’కు తొలి రోజే షాక్: యష్ ‘టాక్సిక్’ ను కూడా దాటలేకపోయిందా?
ఒకవైపు హాలీవుడ్ స్థాయి విజువల్స్.. మరోవైపు వేల కోట్ల బడ్జెట్.. ఇంకోవైపు రాముడిగా రణబీర్ కపూర్! ఇన్ని హంగులు ఉన్నప్పుడు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ రామాయణ విషయంలో తొలి రోజే లెక్కలు కొంత తేడా కొట్టాయి. మరీ ముఖ్యంగా కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ హిందీ వెర్షన్ సాధించిన ఓపెనింగ్‌ను కూడా రామాయణ దాటలేకపోయిందనే చర్చ మొదలైంది. పాజిటివ్ టాక్ వస్తున్నా వసూళ్లు మాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేవా? అసలు రణబీర్ రామాయణకు హిందీ మార్కెట్లో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
రణబీర్‌కు ఇంతకంటే పెద్ద ఓపెనింగ్ రావాల్సిందేనా?
ట్రేడ్ అంచనాల ప్రకారం రామాయణ హిందీ వెర్షన్ తొలి రోజు సుమారు రూ.50-51 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. 3డీ టికెట్ ధరలను కూడా ఇందులో కలిపారు. సాధారణంగా చూస్తే ఇది చిన్న ఓపెనింగ్ కాదు. కానీ ఇక్కడ సమస్య వసూళ్లు తక్కువగా రావడం కాదు.. ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరీ ఎక్కువగా ఉండటమే! భారీ బడ్జెట్, రణబీర్ కపూర్ స్టార్డమ్, రామాయణం లాంటి కథ, అంతర్జాతీయ స్థాయి ప్రమోషన్లు.. ఇవన్నీ కలిపి చూస్తే హిందీలో తొలిరోజే ఇంకా పెద్ద నంబర్ వస్తుందని చాలామంది ఆశించారు. ఆ అంచనాలకు ఇప్పటి వసూళ్లు సరిపోలేదన్నదే అసలు చర్చ.
ఇవి కూడా చదవండి
కన్నడ సినిమా టాక్సిక్‌తో పోలిక ఎందుకొచ్చింది?
ఇప్పుడు ఈ చర్చలోకి ధురంధర్ 2, దృశ్యం 3, టాక్సిక్ సినిమాలు వచ్చి చేరాయి. ధురంధర్ 2 తొలి రోజు సుమారు రూ.120 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, దృశ్యం 3 రూ.60 కోట్ల మార్కును దాటినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇక యష్ నటించిన టాక్సిక్ హిందీ వెర్షన్ సుమారు రూ.54 కోట్ల ఓపెనింగ్ సాధించినట్లు సమాచారం. దీంతో రామాయణ ఓపెనింగ్ టాక్సిక్ కంటే కూడా తక్కువగా ఉందనే పోలిక మొదలైంది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టాక్సిక్ అనేది కన్నడలో తెరకెక్కిన సినిమా. హిందీలో డబ్బింగ్ వెర్షన్‌గా విడుదలైంది. కానీ రామాయణ మాత్రం ప్రధానంగా హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రాజెక్ట్. అలాంటిది హిందీ మార్కెట్లో టాక్సిక్ కంటే వెనుకబడటం ఇప్పుడు రణబీర్ స్టార్‌డమ్‌పై కూడా చర్చకు దారితీస్తోంది. అయితే తొలి రోజు వసూళ్లతోనే ఒక సినిమా స్థాయిని నిర్ణయించడం కూడా తొందరపాటే.
సౌత్ మార్కెట్లో యష్ క్రేజ్ కలిసొస్తుందా?
హిందీలో అంచనాలకు తగ్గ ఓపెనింగ్ రాకపోయినా రామాయణకు ఇంకా అవకాశాలున్నాయి. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్, ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ, పండుగ సెలవులు.. ఇవన్నీ కలెక్షన్లకు ఊతమివ్వవచ్చు. ముఖ్యంగా కర్ణాటకలో యష్‌కు ఉన్న క్రేజ్ కారణంగా అక్కడ సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దక్షిణాది మార్కెట్లలో వచ్చే వసూళ్లు కూడా రామాయణ మొత్తం బాక్సాఫీస్ లెక్కల్లో కీలకంగా మారనున్నాయి.
అయితే రామాయణ అసలు సత్తా వీకెండ్‌తోనే బయటపడుతుంది. తొలి రోజు వచ్చిన వసూళ్లను మించి శని, ఆదివారాల్లో కలెక్షన్లు పెరిగితే సినిమా మంచి ఊపందుకున్నట్లే. లేదంటే ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన, బాక్సాఫీస్ దగ్గర వచ్చిన వసూళ్ల మధ్య ఉన్న గ్యాప్‌పై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రామాయణ ముందు ఉన్న అసలైన సవాలు ఓపెనింగ్ రికార్డులు సృష్టించడం మాత్రమే కాదు.. ప్రేక్షకులను థియేటర్లకు వరుసగా రప్పించి భారీ వసూళ్లుగా మార్చడం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







