నిన్నటి వరకు దూకుడు.. ఇప్పుడు కార్యకర్తలకు హితబోధ..జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల్లో మార్పు..
అనంతపురం (Anantapur) జిల్లా రాజకీయాల్లో తనదైన దూకుడు, సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy). ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేయడంలో ముందుండే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా టీడీపీ (TDP), వైసీపీ (YCP) కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన సూచనలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిత్యం ఘర్షణలు, ఆరోపణలతో వేడెక్కే అనంతపురం జిల్లా రాజకీయాల్లో కార్యకర్తలకు ఆయన ఇచ్చిన సందేశం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉండటం సహజమే. అయితే ఆ పోరు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య వ్యక్తిగత గొడవలుగా మారితే చివరకు నష్టపోయేది వారేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నాయకులు రాజకీయాల్లో తమ స్థానాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తారని, కానీ కార్యకర్తలు మాత్రం కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. నాయకుల కోసం కార్యకర్తలు ఎందుకు గొడవలకు దిగాలని ప్రశ్నించారు. రాజకీయ నాయకులమైన తాము బాగానే ఉంటామని, కింది స్థాయి కార్యకర్తలు మాత్రం అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలిచాయి.
తాడిపత్రి (Tadipatri) రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి జేసీ కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత రాజకీయాల్లో జేసీ కుటుంబం కీలక ప్రభావాన్ని చూపిస్తోంది. స్థానిక రాజకీయ పరిణామాల్లో జేసీ కుటుంబం పాత్ర ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. ప్రత్యర్థి వైసీపీ నేతలతో జేసీ కుటుంబానికి మధ్య రాజకీయ విభేదాలు కూడా చాలాకాలంగా కొనసాగుతున్నాయి.
ఇటీవల కూడా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు తగ్గలేదు. పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగడం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై (Peddareddy) విమర్శలు చేయడం వంటి పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలని ఆయన చెప్పడం ఆసక్తిని పెంచుతోంది.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యల్లనూరు, పుట్టూరు, యాడికి ప్రాంతాల్లో వైసీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లు, వాహనాలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల్లో ఆస్తులు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసులు నమోదయ్యాయని, సుమారు 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే జేసీ వ్యాఖ్యలు వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యకర్తలు కేసుల్లో చిక్కుకుని భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దనే ఉద్దేశంతో ఆయన ఈ సూచనలు చేశారా? లేక జిల్లాలో పెరుగుతున్న రాజకీయ ఘర్షణలకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో మాట్లాడారా? అనే చర్చ సాగుతోంది. ఏదేమైనా నాయకుల రాజకీయ పోరాటాల మధ్య కార్యకర్తలు బలికాకూడదనే ఆయన సందేశం మాత్రం చాలా కరెక్ట్ అని అందరు భావిస్తున్నారు.







