కేరళలో పుట్టిన అమ్మాయి.. అమెరికాలో రెండో అతిపెద్ద నగరానికి మేయర్‌గా ఎలా ఎదిగింది?
అమెరికాలో భారతీయ సంతతి మరోసారి చరిత్ర సృష్టించింది. న్యూయార్క్‌లో జోహ్రాన్ మమ్దానీ తర్వాత ఇప్పుడు లాస్ ఏంజెలెస్‌లోనూ భారతీయ మూలాలున్న నాయకురాలు అత్యున్నత పదవిని చేపట్టబోతున్నారు. కేరళలో పుట్టి, ఆరేళ్ల వయసులోనే కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిన నిత్యా రామన్.. ఇప్పుడు అమెరికాలోని రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెలెస్‌కు మేయర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఆమె ప్రయాణం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. హార్వర్డ్, MITలో చదువుకోవడం దగ్గర నుంచి ఢిల్లీలో మురికివాడల ప్రజల కోసం పోరాడటం వరకు.. అక్కడి నుంచి అమెరికా రాజకీయాల్లో కీలక నాయకురాలిగా ఎదగడం వరకు ఆమె ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది.
ఆరేళ్ల వయసులో అమెరికాకు.. !
నిత్యా రామన్ 1981లో కేరళలోని త్రిస్సూర్‌లో జన్మించారు. ఆమె తండ్రి వెంకటరామన్ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తే, తల్లి సుధా కేచేరి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. కొంతకాలం తిరువనంతపురంలో గడిపిన కుటుంబం.. నిత్యకు ఆరేళ్లు ఉన్నప్పుడు అమెరికాకు వలస వెళ్లింది. అక్కడే ఆమె పెరిగారు. చదువుకున్నారు. ప్రపంచంలోనే పేరున్న హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో ఉన్నత విద్యను అభ్యసించారు.
అయితే అమెరికాలో చదువుకున్న ప్రతి ఒక్కరూ అక్కడే ఉద్యోగం వెతుక్కుంటూ స్థిరపడిపోవాలని అనుకోరు కదా! నిత్యా రామన్ కూడా అందుకు భిన్నంగా ఆలోచించారు. చదువు పూర్తయ్యాక భారత్‌కు తిరిగి వచ్చారు. ఢిల్లీ, చెన్నై నగరాల్లో పనిచేస్తూ పట్టణాల్లో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా చూశారు. ముఖ్యంగా నగరాభివృద్ధి పేరుతో సామాన్యులు ఇళ్లు కోల్పోవడం, కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడటం ఆమెను ఆలోచింపజేశాయి.
ఢిల్లీలో మొదలైన పోరాటం.. చెన్నైలో కొనసాగిన ప్రయాణం!
2010 కామన్వెల్త్ క్రీడల సమయంలో ఢిల్లీలో భారీగా అభివృద్ధి పనులు జరిగాయి. నగరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఒకవైపు సాగుతుంటే.. మరోవైపు మురికివాడల్లో నివసించే పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించే పరిస్థితులు ఎదురయ్యాయి. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు మాత్రమేనా? ఆ నగరంలో తరతరాలుగా నివసిస్తున్న పేదల జీవితాలకు చోటు లేకపోతే దానిని నిజమైన అభివృద్ధి అనగలమా? ఇలాంటి ప్రశ్నలతో నిత్యా రామన్ ఢిల్లీలో మురికివాడల ప్రజలకు మద్దతుగా నిలిచిన పౌర సమాజ ఉద్యమంలో భాగమయ్యారు.
ఆ తర్వాత చెన్నైకి వెళ్లి అక్కడి పేద ప్రాంతాల్లో పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపరచడానికి పనిచేశారు. సమస్యలను పైపైన చూసి పరిష్కారాలు చెప్పడం కాకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. డేటా ఆధారంగా సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు వెతికే విధానాన్ని అనుసరించారు. అప్పట్లో ఆమె చేసిన ఈ పనులు చూస్తే.. భవిష్యత్తులో అమెరికాలో నిరాశ్రయుల సమస్యను ప్రధానంగా తీసుకుని రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.
నిరాశ్రయుల సమస్యే ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందా?
2013లో నిత్యా రామన్ మళ్లీ లాస్ ఏంజెలెస్‌కు వెళ్లారు. అక్కడి నగర పరిపాలనా విభాగంలో చేరి నిరాశ్రయుల సమస్యపై పనిచేసే బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటైన అమెరికాలోనే వేలాది మంది రోడ్లపై నివసించడం, ఇళ్లు లేక ఇబ్బందులు పడటం ఆమెను కలచివేసింది. ఈ సమస్యను దగ్గరగా పరిశీలిస్తున్న కొద్దీ నగర పాలనలో ఉన్న లోపాలు ఆమెకు స్పష్టంగా కనిపించాయి.
ఒక నగరంలో ఇళ్ల ధరలు పెరిగిపోతే, సామాన్యులకు నివసించడానికి చోటు లేకపోతే, రోడ్లు సరిగ్గా లేకపోతే.. వాటిని ఎవరు పరిష్కరించాలి? ప్రభుత్వమే కదా! కానీ ప్రభుత్వం పనిచేసే తీరు సరిగ్గా లేకపోతే పరిస్థితిని మార్చడం ఎలా? ఈ ఆలోచనలే ఆమెను ఎన్నికల రాజకీయాల వైపు నడిపించాయి. అర్బన్ ప్లానర్‌గా మొదలైన ప్రయాణం క్రమంగా రాజకీయ నాయకురాలిగా మారింది.
మేయర్ ఎన్నికల్లో ప్రత్యర్థి చిన్న నాయకురాలు కాదు!
లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో నిత్యా రామన్‌కు ఎదురైన సవాలు అంత సులభమైనదేమీ కాదు. అప్పటికే మేయర్‌గా ఉన్న కరెన్ బాస్ రాజకీయంగా మంచి అనుభవం ఉన్న నాయకురాలు. డెమొక్రటిక్ పార్టీ వ్యవస్థలోనూ ఆమెకు బలమైన మద్దతు ఉంది. మరోవైపు నిత్యా రామన్ ప్రోగ్రెసివ్ భావజాలంతో ముందుకొచ్చిన కొత్త నాయకురాలు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న మేయర్‌ను ఓడించడం అంత తేలికైన విషయం కాదు.
కానీ నిత్యా రామన్ తన ప్రచారంలో ఒక విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. లాస్ ఏంజెలెస్ నగరం ప్రజల కోసం పనిచేయాల్సిన విధంగా పనిచేయడం లేదని విమర్శించారు. ప్రజలు నివసించడానికి ఇళ్లు కొనగలగాలి, నగరంలో సురక్షితంగా తిరగగలగాలి, ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తుందనే నమ్మకం కలగాలి.. ఇవే తన రాజకీయ లక్ష్యాలని ప్రకటించారు.
రోడ్లు, ఇళ్ల కొరత నుంచి కార్చిచ్చుల వరకు.. బాస్ ప్రభుత్వంపై విమర్శలు!
నగరంలోని రోడ్లు, ఫుట్‌పాత్‌ల దుస్థితి, పెరుగుతున్న ఇళ్ల కొరత, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉద్యోగాల తగ్గుదల, కార్చిచ్చుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను నిత్యా రామన్ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. కరెన్ బాస్ ప్రభుత్వం నగర ప్రజల సమస్యల కంటే పోలీసు సంఘాలు, వ్యాపార వర్గాలు వంటి ప్రత్యేక ప్రయోజనాలున్న సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. నగర పాలనలో ప్రజల గొంతుక వినిపించడం లేదని, పాత రాజకీయ విధానాలతో ముందుకు వెళ్తే సమస్యలు పరిష్కారం కావని ఆమె వాదించారు.
ఇక్కడే నిత్యా రామన్ ప్రచారానికి ప్రత్యేకత కనిపించింది. ప్రత్యర్థి రాజకీయ అనుభవాన్ని చూసి వెనక్కి తగ్గకుండా.. నగరంలో సామాన్యులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలనే తన ప్రధాన అస్త్రాలుగా మార్చుకున్నారు. పెద్ద పెద్ద రాజకీయ హామీల కంటే ప్రజల జీవితాల్లో కనిపించే మార్పుల గురించి మాట్లాడారు. అదే ఓటర్లను ఆమె వైపు ఆకర్షించినట్లు కనిపిస్తోంది.
అమెరికా రాజకీయాల్లో మరో భారతీయ మూలాల విజయం!
చివరకు నిత్యా రామన్ ప్రచారం ఫలించింది. Decision Desk HQ లెక్కల ప్రకారం, కరెన్ బాస్‌పై ఆమె 26,124 ఓట్ల ఆధిక్యంతో, 3.34 శాతం తేడాతో విజయం సాధించారు. దీంతో లాస్ ఏంజెలెస్‌కు నాయకత్వం వహించబోతున్న తొలి భారతీయ-అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు.
ఇప్పటికే న్యూయార్క్‌లో జోహ్రాన్ మమ్దానీ భారతీయ మూలాలున్న నాయకుడిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు అమెరికాలోని మరో కీలక నగరమైన లాస్ ఏంజెలెస్‌లోనూ నిత్యా రామన్ విజయం సాధించడం భారతీయ సంతతి రాజకీయ ప్రాధాన్యం పెరుగుతోందనే చర్చకు కారణమైంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల






