ఓటమికి ట్రంప్ చెప్పిన కారణాలు వింటే షాకవ్వాల్సిందే !!
ఎన్నికల్లో గెలిస్తే అది తన గొప్పతనం అని చెప్పుకోవడం.. ఓడిపోతే మాత్రం అందులో తన తప్పేమీ లేదని నిరూపించుకోవడం.. రాజకీయ నాయకులకు ఇది కొత్తేమీ కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్‌లోని రెండు సభలూ డెమొక్రాట్ల చేతుల్లోకి వెళ్లడంతో రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ ఓటమిని ట్రంప్ అంత తేలిగ్గా అంగీకరించడం లేదు. అందుకు రకరకాల కారణాలు చెప్తున్నారు. మీడియాని కూడా తప్పుబడుతున్నారు. ఇంతకీ ట్రంప్ దృష్టిలో తన పార్టీ ఓటమికి కారణాలేంటి?
నేనే పోటీ చేసి ఉంటే సీన్ మరోలా ఉండేది!
ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్లకు వ్యతిరేకంగా వస్తున్న కొద్దీ ట్రంప్ నుంచి ఆసక్తికరమైన స్పందనలు మొదలయ్యాయి. పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఓడిపోతున్నా, తన ఇమేజ్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
“నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒకవేళ నేనే బరిలోకి దిగి ఉంటే భారీ మెజారిటీతో గెలిచేవాళ్లం” అంటూ వ్యాఖ్యానించారు. అంటే పార్టీ అభ్యర్థుల ఓటమిని తన వ్యక్తిగత ప్రజాదరణకు ముడిపెట్టడానికి ఆయన ఇష్టపడటం లేదు. తాను పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్నది ట్రంప్ వాదన.
ఇరాన్ యుద్ధం మంచిదే.. కానీ పెట్రోల్ ధరలు పెరిగితే ఎలా?
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్ యుద్ధం కూడా ఒక కారణమై ఉండొచ్చని అంగీకరించారు. అయితే ఇక్కడ ఆయన చెప్పిన లాజిక్ కొంచెం భిన్నంగా ఉంది. ఇరాన్ విషయంలో తాను తీసుకుంటున్న చర్యలను అమెరికన్లు సమర్థిస్తున్నారని, కానీ ఆ నిర్ణయాల వల్ల పెట్రోల్ ధరలు పెరగడాన్ని మాత్రం వారు ఇష్టపడలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇక్కడే అమెరికా రాజకీయాల్లోని అసలు సమస్య కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యం గురించి అధ్యక్షుడు ఎంత గొప్పగా మాట్లాడినా, సామాన్యుడికి మాత్రం తన జేబులో నుంచి ఎంత ఖర్చవుతోందన్నదే ముఖ్యం. యుద్ధం ఎందుకు జరుగుతోంది? దాని వెనుక వ్యూహం ఏంటి? అన్న విషయాల కంటే పెట్రోల్ కొట్టించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చవుతోందన్నది ఓటర్లకు ఎక్కువగా గుర్తుండిపోతుంది. ట్రంప్ కూడా ఇప్పుడు అదే విషయాన్ని అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది.
తనకు అనుకూలంగా ఉండే మీడియాను కూడా వదల్లేదు!
ఇక ట్రంప్ విమర్శల్లో మరో ఆసక్తికరమైన అంశం ఫాక్స్ న్యూస్. సాధారణంగా రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా ఉండే ఛానెల్‌గా గుర్తింపు పొందిన ఫాక్స్ న్యూస్‌పైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డెమొక్రాట్లకు చెందిన నేతలకు పదేపదే ప్రసారాల్లో అవకాశం ఇవ్వడం, తనను వ్యతిరేకించే వారి వాదనలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే రిపబ్లికన్లకు నష్టం జరిగిందని ఆరోపించారు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ప్రత్యర్థులను విమర్శించడం ఒక ఎత్తయితే, తమకు మద్దతుగా ఉంటుందని భావించే మీడియా సంస్థనే తప్పుబట్టడం మరో ఎత్తు. ట్రంప్ మాత్రం రెండో పనిని కూడా చేసేశారు. తన పార్టీ ఓటమికి మీడియా కవరేజీ కూడా కారణమని చెప్పడం ద్వారా విమర్శల పరిధిని మరింత పెంచారు.
ఇక ట్రంప్ అనుకున్నవన్నీ జరగవా?
ఈ ఎన్నికల ఫలితాలతో ట్రంప్‌కు అసలైన రాజకీయ పరీక్ష ఇప్పుడే మొదలుకానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై డెమొక్రాట్ల నియంత్రణ ఏర్పడుతుంది. దీంతో ట్రంప్ తీసుకొచ్చే కొత్త విధానాలను అడ్డుకోవచ్చు. ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు చేపట్టవచ్చు. ఇప్పటివరకు తన పార్టీ మద్దతుతో ముందుకు తీసుకెళ్లిన అనేక నిర్ణయాలకు ఇకపై ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, చైనాతో సంబంధాలు, తైవాన్ సమస్య, ఏఐ రంగంపై ప్రభుత్వ విధానాలు వంటి అంశాల్లో ట్రంప్‌కు కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు ఎదురుకావచ్చు. అధ్యక్షుడిగా మరో రెండేళ్లు పదవిలో ఉన్నప్పటికీ, రాజకీయంగా ఆయన స్వేచ్ఛ తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.
నిజానికి ట్రంప్ ఇప్పుడు చెబుతున్న కారణాలన్నీ ఒకటే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. అమెరికా ఓటర్లకు ప్రపంచాన్ని శాసించే నాయకుడు కావడం మాత్రమే సరిపోదు. తమ జీవితాల్లో ఖర్చులు తగ్గించే నాయకుడు కూడా కావాలి. యుద్ధంలో గెలవడం కంటే ఇంటి బడ్జెట్లో గెలవడమే ముఖ్యమని ఓటర్లు చెప్పారేమో! మరి ఈ సందేశాన్ని ట్రంప్ అర్థం చేసుకుంటారా? లేక వచ్చే ఎన్నికల వరకు తన ఓటమికి కొత్త కారణాలు వెతుకుతూనే ఉంటారా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల







