డెమోక్రాట్ల గెలుపు… చైనాకు జాక్‌పాట్? తెర వెనుక అసలు గేమ్ ఇదే! !
అమెరికా, చైనా మధ్య సంబంధాలు మొదటి నుంచీ ఉప్పూనిప్పులాగే ఉంటున్నాయి. వాణిజ్యం దగ్గర మొదలైన పోటీ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, సైనిక ఆధిపత్యం వరకు విస్తరించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విషయంలో ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న పోటీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చైనాను AI రేసులో వెనక్కి నెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అమెరికానే ప్రపంచ AI సూపర్ పవర్‌గా ఉండాలన్నది ఆయన లక్ష్యం.
కానీ ఇప్పుడు అమెరికాలో జరిగిన రాజకీయ పరిణామం చైనాకు అనుకోని అవకాశాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘనవిజయం సాధించి కాంగ్రెస్‌లోని రెండు సభలపై పట్టు సాధించారు. పైకి చూస్తే ఇది అమెరికా అంతర్గత రాజకీయ వ్యవహారంలా కనిపించవచ్చు. కానీ దీని ప్రభావం నేరుగా అమెరికా AI రంగంపై పడే అవకాశం ఉంది.
ఎందుకంటే డెమోక్రాట్లు AI కంపెనీలపై కఠినమైన నియంత్రణలు, డేటా సెంటర్ల నిర్మాణంపై ఆంక్షలు విధించాలనే వైఖరితో ఉన్నారు. అదే జరిగితే అమెరికా AI అభివృద్ధి వేగం తగ్గవచ్చు. ఇలాంటి పరిస్థితి కోసం ఎదురుచూస్తున్న చైనాకు ఇది నిజంగానే జాక్‌పాట్‌గా మారుతుందా ..ఇప్పుడు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో ఇదే ఆసక్తికరమైన చర్చ.
అమెరికా AI రేసులో చైనాకు దొరికిన రాజకీయ అవకాశం!
AI రంగంలో అమెరికా ఆధిపత్యానికి ప్రధాన కారణం అక్కడి టెక్ కంపెనీలు పెడుతున్న భారీ పెట్టుబడులు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓపెన్ఏఐ వంటి సంస్థలు అత్యాధునిక AI మోడళ్లను అభివృద్ధి చేయడానికి వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఇందుకోసం భారీ డేటా సెంటర్లు నిర్మిస్తున్నాయి. వీటికి అపారమైన కంప్యూటింగ్ సామర్థ్యం, విద్యుత్, నీరు అవసరం.
ఇవి కూడా చదవండి
అయితే ఈ అభివృద్ధి వెనుక మరో సమస్య బయటపడుతోంది. డేటా సెంటర్ల వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోందని, దాని ప్రభావం సామాన్య ప్రజల బిల్లులపై పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ సమస్యలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీంతో డేటా సెంటర్ల నిర్మాణాన్ని నియంత్రించాలనే డిమాండ్ బలపడుతోంది.
ఇదే ఇప్పుడు డెమోక్రాట్లకు రాజకీయంగా కీలకమైన అంశంగా మారింది. NBC News నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. 56 శాతం మంది ఓటర్లు తమ ఓటు విషయంలో AI, డేటా సెంటర్ల అంశాన్ని కీలకమైనదిగా లేదా ప్రధానమైనదిగా పరిగణించారు. వీరిలో 64 శాతం మంది డెమోక్రాట్లు కావడం గమనార్హం. అంటే AIపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన ఎన్నికల రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తోందన్నమాట.
అమెరికాలో AI వేగం తగ్గితే చైనాకు బిజినెస్ ఛాన్స్!
ఈ పరిణామాలను చైనా ఎలా ఉపయోగించుకోగలదన్నదే అసలు ప్రశ్న. నాటిక్సిస్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త గ్యారీ ంగ్ విశ్లేషణ ప్రకారం.. అమెరికాలో AI అభివృద్ధి నెమ్మదిస్తే అది చైనాకు ప్రయోజనకరంగా మారవచ్చు.
డెమోక్రాట్లు అధికారంలోకి రావడంతో డేటా సెంటర్ల నిర్మాణానికి సంబంధించిన నిబంధనలు కఠినతరం కావచ్చు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం కావచ్చు. నిర్మాణ ఖర్చులు పెరగవచ్చు. ఫలితంగా అమెరికాలో కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగే వేగం తగ్గే అవకాశం ఉంది.
అయితే ఇక్కడ చైనా తన వ్యూహాన్ని అమలు చేయవచ్చు. అమెరికాలో AI సేవలు అందించడానికి అయ్యే ఖర్చులు పెరిగితే, తక్కువ ఖర్చుతో సేవలు అందించే చైనా కంపెనీలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగవచ్చు. ముఖ్యంగా AI మోడళ్లను ఉపయోగించి సమాధానాలు, కంటెంట్, ఇతర సేవలు అందించే Inference Services రంగంలో చైనాకు మంచి అవకాశాలు లభించవచ్చని గ్యారీ ంగ్ అభిప్రాయపడ్డారు.
అంటే అమెరికా తన AI పరిశ్రమను నియంత్రించుకునే ప్రయత్నంలో ఉంటే, చైనా మాత్రం తక్కువ ఖర్చుతో AI సేవలను ప్రపంచానికి అందించే వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇదే ఈ ఎన్నికల ఫలితాల్లో చైనాకు కనిపిస్తున్న అసలు లాభం.
AIతో మరో AIని తయారు చేసే టెక్నాలజీపైనా ఆంక్షలా?
డెమోక్రాట్ల నియంత్రణలు కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకపోవచ్చు. అత్యాధునిక AI పరిశోధనలపైనా వాటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే AI భద్రతపై అమెరికాలో చర్చ తీవ్రమైంది. AI వ్యవస్థలు అనూహ్యంగా ప్రవర్తించడం, సైబర్ దాడుల్లో వాటి వినియోగం పెరగడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
మిచిగాన్కు చెందిన కొత్త డెమోక్రటిక్ నేత అబ్దుల్ ఎల్-సయీద్ AI అభివృద్ధిపై కొంతకాలం విరామం విధించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో విడుదల చేసిన AI విధానంలో Recursive Self-Improvement అనే టెక్నాలజీపై నిషేధం విధించాలనే ప్రతిపాదన కూడా ఉంది.
ఈ టెక్నాలజీ ద్వారా ఒక AI వ్యవస్థ తనకంటే మరింత శక్తివంతమైన మరో AI వ్యవస్థను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే AI సాయంతోనే మరింత అధునాతన AIని సృష్టించడం. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ AI కంపెనీలు ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నాయి.
ఇలాంటి పరిశోధనలపై అమెరికాలో కఠినమైన నియంత్రణలు వస్తే అక్కడి కంపెనీల అభివృద్ధి ప్రణాళికలు ప్రభావితమవుతాయి. అదే సమయంలో చైనా కంపెనీలకు అంతర్జాతీయ AI మార్కెట్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే అవకాశం దొరకవచ్చు.
అమెరికా AI సామ్రాజ్యానికి టెక్సాస్ నుంచే సమస్య!
ఈ మొత్తం వ్యవహారంలో టెక్సాస్ రాష్ట్రం చాలా కీలకం. ఎందుకంటే అమెరికాలో నిర్మిస్తున్న భారీ AI డేటా సెంటర్లలో ఈ రాష్ట్రం వాటా చాలా ఎక్కువగా ఉండబోతోంది. కానీ ఇప్పుడు అక్కడే డేటా సెంటర్ల నిర్మాణంపై వ్యతిరేకత పెరుగుతోంది.
టెక్సాస్‌లో గినా హినోజోసా, జార్జియాలో కీషా లాన్స్ బాటమ్స్ వంటి కొత్తగా ఎన్నికైన డెమోక్రటిక్ నేతలు డేటా సెంటర్లపై కఠినమైన పర్యవేక్షణకు మద్దతుగా ప్రచారం చేశారు. విద్యుత్ బిల్లులు పెరగడం, పర్యావరణంపై ప్రభావం, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినడం వంటి అంశాలే వారి ప్రచారంలో ప్రధానంగా నిలిచాయి.
పరిశోధనా సంస్థ SemiAnalysis అంచనా ప్రకారం.. 2028 నాటికి అమెరికాలో కొత్తగా అందుబాటులోకి వచ్చే కంప్యూటింగ్ సామర్థ్యంలో దాదాపు 30 శాతం టెక్సాస్ నుంచే రావాల్సి ఉంది. అందుకే అక్కడ డేటా సెంటర్ల నిర్మాణంలో కొన్ని నెలల ఆలస్యం జరిగినా దేశవ్యాప్తంగా AI విస్తరణపై ప్రభావం పడవచ్చని సంస్థ పేర్కొంది.
అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వల్ల 2027లో అందుబాటులోకి వచ్చే కంప్యూటింగ్ సామర్థ్యంపై ఎన్నికల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా. అసలు ప్రభావం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపై కనిపించవచ్చు.
అమెరికా కంపెనీలు ఆసియాకు వస్తే.. చైనాతో కొత్త పోటీ!
అమెరికాలో డేటా సెంటర్ల నిర్మాణానికి ఆంక్షలు పెరిగితే మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోవచ్చు. Amazon Web Services, Google వంటి దిగ్గజ కంపెనీలు కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కోసం అమెరికా వెలుపల ఉన్న మార్కెట్లను పరిశీలించవచ్చు.
ముఖ్యంగా ఆసియా దేశాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు అమెరికా కంపెనీలు, చైనా కంపెనీలు రెండూ ఒకే అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడాల్సి వస్తుంది. భారత్ వంటి దేశాలకు కూడా ఈ పరిణామం కొత్త పెట్టుబడులు, డేటా సెంటర్ల నిర్మాణం రూపంలో అవకాశాలు కల్పించవచ్చు.
చైనాకు నిజంగానే జాక్పాటా?
అమెరికా, చైనా మధ్య AI ఆధిపత్య పోరు ఇప్పటివరకు చిప్స్, పెట్టుబడులు, టెక్నాలజీ, పరిశోధనల చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఈ పోరులో అమెరికా అంతర్గత రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి.
అమెరికా AI కంపెనీలకు మరిన్ని నియంత్రణలు ఎదురైతే వాటి అభివృద్ధి వేగం తగ్గవచ్చు. డేటా సెంటర్ల నిర్మాణం ఆలస్యమైతే కంప్యూటింగ్ సామర్థ్యం పెరగడం కూడా నెమ్మదించవచ్చు. ఈ గ్యాప్‌ను చైనా కంపెనీలు ఉపయోగించుకుంటే అంతర్జాతీయ AI మార్కెట్లో కొత్త సమీకరణాలు ఏర్పడవచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







