నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఎస్సీ-2026 ద్వారా 2,721 టీచర్ పోస్టుల భర్తీ..
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం వచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం డీఎస్సీ-2026 (AP DSC 2026) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,721 పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ ప్రకటనతో తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తున్నారు. నవంబర్ 11 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండటంతో ఆశావహులు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
పాఠశాల విద్యాశాఖ (School Education Department) ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుంది. ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రత్యేక విద్యా సంస్థలు, వివిధ సంక్షేమ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో సాధారణ పాఠశాలలకు సంబంధించిన పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ (School Assistant) విభాగంలో 906 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ ( SGT) విభాగంలో 1,205 పోస్టులు ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో కలిపి 2,111 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రత్యేక విద్యా విభాగంలో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 150 ఉండగా, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టులు 200 ఉన్నాయి. వీటితో పాటు వివిధ విద్యాసంస్థల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ విభాగాలన్నింటిలో కలిపి మరో 260 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు తమ అర్హతలను బట్టి సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిబంధనలు, వయోపరిమితి వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలను పరిశీలించడం అవసరం.
ఈసారి రాత పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో (Computer Based Test – CBT) నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన సిలబస్, జిల్లాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లు, పోస్టుల వివరాలను అధికారిక ప్రకటనలో పొందుపరిచారు. ఎంపిక విధానం, పరీక్ష తేదీలు, ఇతర ముఖ్యమైన వివరాలను కూడా అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 11 నుంచి ప్రారంభం కానుండటంతో అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వెబ్సైట్: tet2dsc.apcfss.in. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నియామకాలు మంచి అవకాశంగా మారనున్నాయి. ముఖ్యంగా డీఎస్సీ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. 2,721 పోస్టుల భర్తీతో రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.







