వస్త్ర కార్మికుల సమ్మెతో ఉద్రిక్తంగా బంగ్లాదేశ్..!
ఖర్చులు పెరిగాయి.. నిత్యవసరాలు నింగినంటుతున్నాయి. మా వేతనాలు మాత్రం అక్కడే ఆగిపోయాయి. నెలకు మీరిచ్చే 12,500 టాకాలతో ఎలా బతికేది.. మాకు వేతనాలు పెంచాలి.. ప్రస్తుత కష్టకాలంలో కుటుంబం బతకాలంటే 30 వేల టాకాలు కావాలంటూ.. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ కార్మికులు … సమ్మెకు దిగారు. వస్త్రకార్మికుల సమ్మెతో బంగ్లాదేశ్ లోని వందలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.
వేతనాలు పెంచాలంటూ వేలాది మంది కార్మికులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనల ప్రభావం దేశవ్యాప్తంగా వందలాది వస్త్ర పరిశ్రమల నిర్వహణపై పడింది.
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వస్త్ర పరిశ్రమ కీలకం. ఈ రంగం ద్వారా ఏటా సుమారు 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. దేశంలో దాదాపు 2,500 వస్త్ర పరిశ్రమలు ఉండగా, వీటిలో సుమారు 40 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలే.
రాజధాని ఢాకాలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతుండగా, నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలకు కూడా ఆందోళనలు విస్తరించాయి. నారాయణ్‌గంజ్ జిల్లాలోని ఫతుల్లాలో కార్మికులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఢాకా సమీపంలోని సవార్ ప్రాంతం అషులియాలో సుమారు 100 ఫ్యాక్టరీలు మూతపడినట్లు అక్కడి ఇండస్ట్రియల్ పోలీస్ సూపరింటెండెంట్ మొమినుల్ ఇస్లాం భుయాన్ తెలిపారు.
కార్మికుల వేతన డిమాండ్లపై ప్రభుత్వం కొత్త వేతన బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఛైర్మన్ సయ్యద్ ఆజాద్ సుభానీ మాట్లాడుతూ.. కొత్త వేతన విధానం ప్రకారం కార్మికులకు వచ్చే ఏడాది జనవరిలో తొలి జీతాలు అందుతాయని తెలిపారు.







