పార్లమెంటులో చర్చిద్దాం.. రాహుల్ కు బీజేపీ సవాల్..!
లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు బీజేపీ గట్టిగానే బదులిచ్చింది. రాజ్యాంగం కల్పించిన పార్లమెంటులో సభా వేదికను వినియోగించుకుని.. రాహుల్ చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమని బీజేపీ నేతలు ప్రకటించారు. రాహుల్ గాంధీ, ఇతర విపక్షనేతలు సభకు వచ్చి… వారి ఆరోపణలను సభావేదికపై ప్రశ్నించాలన్నారు. అంతే కాని.. సోషల్ మీడియాలో కాదన్నారు.
పార్లమెంటులో చర్చకు పారిపోతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం ప్రధాని మోడీకి సవాళ్లు విసురుతున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. ‘‘2023లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగం మొదలు కాగానే లోక్సభ నుంచి రాహుల్ పారిపోయారు. మణిపుర్ అంశంపై కూడా ఇలాగే జరిగింది. మేం ఏ అంశంపై మాట్లడం మొదలుపెట్టినా.. రాహుల్ మాత్రం పారిపోతుంటారు. చర్చకు మేం సిద్ధం. రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు రూపంలో చర్చలకు వేదిక కల్పించారు.
ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి పార్లమెంటులో నేను చర్చించనటం ఇది రాజ్యాంగ స్ఫూర్తికే అవమానం’’ అనిబీజేపీ నేతలు మండిపడ్డారు. బహిరంగ చర్చ కోసం వేదికను ఎంచుకోవాలని ప్రధాని మోడీకి రాహుల్ సవాల్ విసరడంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అటువంటి వేదిక ఇప్పటికే పార్లమెంటులో ఉందని కాంగ్రెస్ అగ్రనేతకు సూచించారు.







