అగ్నివీర్ పథకంలో భారీ మార్పులు.. కేంద్రం కీలక నిర్ణయం..!
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అగ్నివీర్ నియామక పథకంలో కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ అత్యంత కీలకమైన, చారిత్రాత్మక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దేశ రక్షణ దళాల అధిపతి (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి బుధవారం ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో అగ్నివీర్లకు సంబంధించిన తాజా కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. అగ్నివీర్ల సేవల పొడిగింపుతో పాటు వారు సైన్యంలో శాశ్వత ప్రాతిపదికన కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
పాత నిబంధనల ప్రకారం, ఎంపికైన అగ్నివీర్లు నాలుగేళ్ల పాటు సేవలు అందించిన తర్వాత.. వారిలో 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ దళాల్లోకి తీసుకుని, మిగిలిన 75 శాతం మందిని విధుల నుంచి తప్పించాల్సి ఉంది. అయితే, మొదటి బ్యాచ్ అగ్నివీర్ల నాలుగేళ్ల పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో కేంద్రం ఈ నిబంధనలను సవరించింది. తాజా కేబినెట్ నిర్ణయం ప్రకారం, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న మిగిలిన 75 శాతం అగ్నివీర్లకు అదనంగా మరో రెండేళ్ల పాటు సేవా కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఆఫర్ చేయనుంది.
ఇవి కూడా చదవండి
ఈ తాజా మార్పులతో అగ్నివీర్ల మొత్తం సేవా కాలం ఆరేళ్లకు చేరుకోనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏమిటంటే.. ఈ పొడిగించిన రెండేళ్ల అదనపు సర్వీస్ ముగిసిన తర్వాత, రక్షణ దళాల్లో కొనసాగడానికి ఆసక్తి ఉన్న అగ్నివీర్లందరికీ రెగ్యులర్ సైనికులుగా చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అయితే, ఈ పూర్తి స్థాయి నియామకం అనేది అభ్యర్థుల స్వయంసమర్పణ, ఒక నిర్దిష్ట నిష్పాక్షిక ఎంపిక ప్రమాణాల ఆధారంగానే జరుగుతుందని సీడీఎస్ జనరల్ రాజా సుబ్రమణి స్పష్టం చేశారు.







