కాంగ్రెస్‌లో రగులుతున్న నిధుల కుంపటి!
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతోంది. అయినా ఇప్పటికీ ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మాత్రం చల్లారట్లేదు. ప్రతిపక్షాల నుంచి పక్కన పెడితే, ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే తీవ్ర విమర్శలు వస్తుండటం రేవంత్ రెడ్డికి పెద్ద సమస్యగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత పోచారం శ్రీనివాస రెడ్డి లాంటి ప్రముఖులు నిధుల కొరతపై బహిరంగంగానే గళం విప్పుతున్నారు. ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాదిరిగానే పోరాడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము అడిగినట్లు నిధులు ఇవ్వట్లేదని, తమకు లేదా తమ అనుకూల కంపెనీలకు టెండర్లు కట్టబెట్టట్లేదనే అసంతృప్తి వీళ్ల మాటల్లో కనిపిస్తోంది. హైదరాబాద్ రేడియల్ రోడ్ల టెండర్లు మొదలుకుని స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏపీకి చెందిన కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తున్నారని, లోకల్ కాంట్రాక్టర్లను పక్కనబెడుతున్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. మరోవైపు, జడ్చర్లలో అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో అనిరుధ్ రెడ్డి ఆమరణ దీక్ష హెచ్చరికల వరకు వెళ్లడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నిధులు విడుదల కాక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో నెరవేర్చలేక సతమతమవుతున్న మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా లోలోపల వీరికి మద్దతుగా గళం కలిపే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
స్వపక్ష నేతలు రోడ్డెక్కి విమర్శలు చేస్తుంటే, వారిని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన టీపీసీసీ నాయకత్వం విఫలమవుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అసంతృప్త నేతలను పిలిచి చర్చించాల్సింది పోయి, క్రమశిక్షణ చర్యలంటూ హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడికి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, రాజగోపాల్ రెడ్డి గతంలో పార్టీ మారిన నేపథ్యం ఉండటంతో, ఆయన ఒత్తిళ్లకు తలొగ్గకూడదనే ఉద్దేశంతోనే అధిష్ఠానం ఈ విమర్శలను కొంతవరకు లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం. సీనియర్ల ఒత్తిళ్లకు లొంగితే పార్టీలో కొత్త వారికి, రేవంత్ విధేయులకు అవకాశాలు దక్కవనే వ్యూహం వెనుక ఉన్నట్లు తెలుస్తోంది.
శాసనసభలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం బలంగానే ఉన్నప్పటికీ, సొంత ఎమ్మెల్యేలే రెబెల్స్‌గా మారి అవినీతి, టెండర్ల మళ్లింపు ఆరోపణలు చేయడం ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు ఆయుధాలను అందించినట్లవుతుంది. అంతేకాక మున్ముందు ఈ నిధుల గోల కేవలం ఇద్దరు ముగ్గురు నేతల సమస్య కాకుండా పార్టీ మొత్తానికి పాకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి, అసంతృప్త నేతలతో వ్యక్తిగతంగా సమావేశమై టెండర్లు, నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంది. పార్టీలో అందరినీ కలుపుపోతేనే మేలు. లేకుంటే ఈ చిన్న నిప్పు భవిష్యత్‌లో పెద్ద దావానలంగా మారి ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసే ప్రమాదముంది.







