అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) బుధవారం హైదరాబాద్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కోణంలో అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) పరిధిలో జరిగిన మద్యం రవాణా టెండర్ల కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 195 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. ఈ టెండర్లలో నిబంధనలను కొందరికి అనుకూలంగా మార్చి, అక్రమ మార్గాల్లో నిధులను మళ్లించారనే ఆరోపణలపై అంబటి రాంబాబును అధికారులు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
గుంటూరు డిపోల పరిధిలో సబ్ కాంట్రాక్టులు పొందిన వ్యక్తుల బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లిన నిధుల ప్రవాహం వెనుక ఉన్న వాస్తవాలపై ఈడీ ఆరా తీసింది. విచారణ ముగిసిన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరించానని, తనకు తెలిసిన వివరాలన్నింటినీ స్పష్టంగా తెలియజేశానని చెప్పారు. ఒక ప్రజాప్రతినిధిగా తనను నమ్ముకున్న అనుచరులకు లేదా అధికారులకు రికమండేషన్ చేయడం రాజకీయాల్లో సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే తాను గతంలో ఏపీఎస్బీసీఎల్ ఎండీగా పనిచేసిన దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని రికమెండ్ చేసినట్లు అంగీకరించారు. అయితే, ఆ రికమండేషన్ తర్వాత తెరవెనుక ఏం జరిగిందనే విషయాలు తనకు ఏమాత్రం తెలియవని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్లను దర్యాప్తు సంస్థ ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అంబటి రాంబాబును విచారించడంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి.







