తుఫాన్ నష్టంపై పెమ్మసాని కీలక కామెంట్స్..!
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, రెండు వరుస తుఫానుల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహాయం అందిస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrashekhar) భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో బుధవారం ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో నీట మునిగిన వరి, మినుము, పత్తి పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పట్టిసీమ నీటిని సకాలంలో విడుదల చేయడంతో ఎకరానికి 50 బస్తాల వరకు రికార్డు స్థాయి వరి దిగుబడి వచ్చేలా పంటలు సమృద్ధిగా పండాయని గుర్తుచేశారు. అయితే, దురదృష్టవశాత్తూ వరుసగా వచ్చిన రెండు తుఫానుల (అర్నబ్, మురసు) కారణంగా చేతికొచ్చే దశలో ఉన్న వరితో పాటు మినుము, పత్తి పంటలు పూర్తిగా నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పడిన కష్టమంతా కళ్లముందే నాశనమవ్వడం అత్యంత బాధాకరమన్నారు.
ప్రభుత్వం నుంచి అందే ఇన్పుట్ సబ్సిడీ మరియు పరిహారం నేరుగా వాస్తవంగా సాగు చేసిన కౌలు రైతులకే దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు భూ యజమానులు కూడా మానవత్వంతో స్పందించి కౌలు రైతులకు సహకరించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఈ-క్రాప్ (e-crop) బుకింగ్ ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని, అర్హులైన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగడానికి వీల్లేదని అధికారులను హెచ్చరించారు.







