పేరెంట్స్‌తో బ్రేకప్..లక్షలు ఖర్చుపెట్టి మరీ వదలించుకుంటున్నారు ! Gen Z కొత్త ట్రెండ్!
సాధారణంగా తల్లి,తండ్లులతో మనకు గొడవలైతే ఏం చేస్తాం?
కోపం వచ్చినప్పుడు మాట్లాడటం మానేస్తాం. కొన్నాళ్లు దూరంగా ఉంటాం. మళ్లీ ఏదో ఒకరోజు మాట్లాడుకుంటాం. కానీ జపాన్‌లో కొందరు మాత్రం ఈ విషయంలో నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోయారు.
సొంత పేరెంట్స్‌తోనే పూర్తిగా కట్ ఆఫ్ అయిపోతున్నారు. వాళ్ల ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. వాళ్లతో కలిసి ఉండటం లేదు. చివరికి వాళ్లకు వయసు మీద పడి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చినా, ఇతర అవసరాలు వచ్చినా తామెందుకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఆ పనులన్నీ చేయడానికి ప్రత్యేక ఏజెన్సీలను పెట్టుకుంటున్నారు. వాటికి లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా జపాన్‌లో ఇదొక కొత్త సోషల్ ట్రెండ్‌గా మారుతోంది.
దీనికి ‘ఫ్యామిలీ సెపరేషన్’ (Family Separation) అని పేరు పెట్టారు. సింపుల్‌గా చెప్పాలంటే.. పేరెంట్స్‌తో రిలేషన్‌షిప్‌కు గుడ్‌బై చెప్పేయడం. వాళ్లతో మాట్లాడటం, వాళ్ల బాగోగులు చూసుకోవడం, చివరికి అంత్యక్రియలు నిర్వహించడం వంటి బాధ్యతలను కూడా బయటి వ్యక్తులకు అప్పగించేయడం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ట్రెండ్‌లో 20, 30 ఏళ్ల యువత కూడా భారీగా చేరుతోంది.
నాలుగేళ్లలో సిక్స్ టైమ్స్ పెరిగిన క్రేజ్!
జపాన్‌లో వృద్ధులకు జీవిత సహాయ సేవలు అందించే LMN అనే సంస్థకు వస్తున్న రిక్వెస్టులు చూస్తే ఈ ట్రెండ్ ఎంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతోందో అర్థమవుతుంది. 2022 జనవరి నుంచి మార్చి మధ్య ఇలాంటి సేవల కోసం సంస్థను సంప్రదించినవారు 55 మంది మాత్రమే. కానీ 2026లో అదే మూడు నెలల వ్యవధిలో ఆ సంఖ్య 320కి చేరింది. అంటే నాలుగేళ్లలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది.
ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. గతంలో ఈ సేవల కోసం ఎక్కువగా 60, 70 ఏళ్ల వయసున్నవాళ్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు 20, 30 ఏళ్ల యువత కూడా ఈ లిస్టులోకి వచ్చేశారు. మొత్తం విచారణల్లో వీళ్ల వాటా ఏకంగా 40 శాతంగా ఉంది. అంటే పేరెంట్స్‌తో రిలేషన్ కట్ చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు యంగ్ జనరేషన్‌లోనూ పెరుగుతోందన్నమాట.
చిన్నప్పుడు టార్చర్ పెట్టారు.. ఇప్పుడు కేర్ చేయమంటే ఎలా?
ఈ ట్రెండ్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ రీజన్ ఉంది. చిన్నతనంలో పేరెంట్స్ నుంచి మానసిక వేధింపులు ఎదుర్కొన్నవాళ్లు, మాటలతో బాధపెట్టించుకున్నవాళ్లు, నిర్లక్ష్యానికి గురైనవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లకు చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ చేదుగానే మిగిలిపోయాయి.
ఇప్పుడు అదే పేరెంట్స్‌కు వయసు మీద పడింది. వాళ్లను చూసుకోవాల్సిన టైమ్ వచ్చింది. కానీ పిల్లలు మాత్రం గతాన్ని మర్చిపోలేకపోతున్నారు. చిన్నప్పుడు మా బాధలు పట్టించుకోలేదు.. ఇప్పుడు మాత్రం మేమే మీకు అండగా ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పులకు కనీసం సారీ చెప్పకుండా, వృద్ధాప్యంలో పిల్లల నుంచి కేర్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్? అనేది వాళ్ల వాదన.
అందుకే పేరెంట్స్ అనే ఒకే ఒక్క కారణంతో తమ మెంటల్ పీస్‌ను పణంగా పెట్టడానికి ఇష్టపడటం లేదు. తమ లైఫ్‌ను తాము చూసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు.
పేరెంట్స్ కోసం ఏజెన్సీని హైర్ చేసుకోవడం.. ఇదో కొత్త బిజినెస్!
ఇప్పుడు జపాన్‌లో కొన్ని ప్రత్యేక ఏజెన్సీలు ఈ బాధ్యతలను తీసుకుంటున్నాయి. పేరెంట్స్‌ను హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చినా, అవసరమైన పేపర్‌వర్క్ చేయాల్సి వచ్చినా, వృద్ధాప్యంలో వారికి సహాయం కావాల్సి వచ్చినా ఈ సంస్థలే చూసుకుంటాయి. చివరికి మరణించిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తాయి.
అయితే ఈ సర్వీసులకు రేట్లు కూడా గట్టిగానే ఉన్నాయి. ముందుగా 5.5 లక్షల జపనీస్ యెన్లు (సుమారు రూ.3.2 లక్షలు) రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి నాలుగు గంటల సేవకు 11 వేల యెన్లు (సుమారు రూ.6,500) ఇవ్వాలి. సాధారణంగా నెలకు ఒకటి, రెండు సార్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. కొందరైతే నెలకు పదిసార్లు కూడా ఏజెన్సీలను హైర్ చేసుకుంటున్నారట.
ఒక్కసారి గమనించండి.. సొంత పేరెంట్స్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లే పని నుంచి వాళ్ల చివరి ప్రయాణానికి ఏర్పాట్లు చేసే వరకు అన్నింటికీ ఇప్పుడు పెయిడ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. డబ్బులు ఎక్కువైనా పర్లేదు.. తమకు ప్రశాంతత కావాలనుకునేవాళ్లు ఈ సేవలను ఎంచుకుంటున్నారు.
బ్రేకప్ చెప్పారు.. కానీ పూర్తిగా మర్చిపోలేకపోతున్నారు!
ఇక్కడే ఒక ఇంట్రస్టింగ్ సైకాలజీ కనిపిస్తోంది. పేరెంట్స్‌తో కాంటాక్ట్ కట్ చేసినంత మాత్రాన వాళ్ల గురించి ఆలోచించడం పూర్తిగా ఆగిపోవడం లేదు. LMN సంస్థ అధిపతి హిడేకి ఎండో చెప్పిన ప్రకారం.. రోజూ పేరెంట్స్ నుంచి వచ్చే కాల్స్, వాళ్ల గురించి నిరంతరం టెన్షన్ పడాల్సిన పరిస్థితి నుంచి బయటపడాలని చాలామంది ఈ సర్వీసులు తీసుకుంటున్నారు.
కానీ మరోవైపు వాళ్లను పూర్తిగా ఒంటరిగా వదిలేస్తే ఏం జరుగుతుందోననే భయం కూడా ఉంది. అంటే రిలేషన్ వద్దనుకుంటున్నారు.. కానీ బాధ్యతలను పూర్తిగా తప్పుకోలేకపోతున్నారు. అందుకే తాము నేరుగా వెళ్లకుండా ఏజెన్సీల ద్వారా పనులు చేయిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఎమోషనల్‌గా బ్రేకప్ చెప్పి, ప్రాక్టికల్‌గా మాత్రం కనెక్షన్ కొనసాగిస్తున్నారు.
మన దగ్గర కూడా వస్తుందా?
ఈ ట్రెండ్ చూస్తుంటే ఒక విషయం అర్థమవుతోంది. కొత్త జనరేషన్‌కు కుటుంబ బంధాల కంటే వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతత ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయి. పేరెంట్స్‌తో రిలేషన్ బాగుంటే ఎలాంటి సమస్య లేదు. కానీ ఆ బంధమే తమకు మానసిక భారంగా మారితే దూరంగా ఉండటానికైనా సిద్ధమవుతున్నారు.
అయితే ఈ ధోరణికి మరో వైపు కూడా ఉంది. వృద్ధాప్యంలో పేరెంట్స్‌ను చూసుకునేవాళ్లు లేకపోతే వాళ్ల పరిస్థితి ఏంటి? అందరూ ఇలాగే ఏజెన్సీలపై ఆధారపడితే కుటుంబ బంధాలు పూర్తిగా కమర్షియల్ సర్వీసులుగా మారిపోతాయా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఒకప్పుడు పిల్లల కోసం పేరెంట్స్ తమ జీవితాలను త్యాగం చేసేవారు. ఇప్పుడు కొందరు తమ మెంటల్ పీస్ కోసం పేరెంట్స్‌తోనే రిలేషన్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి? చిన్నప్పుడు పిల్లలను బాధపెట్టిన పేరెంట్స్నా? లేక గతాన్ని మర్చిపోయి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలా? జపాన్‌లో మొదలైన ఈ ట్రెండ్ కుటుంబం అనే పదానికి కొత్త అర్థం చెబుతోందా?
—-సూర్య ప్రకాష్ జోశ్యుల







