గుంటూరు జిల్లాలో ఎన్నికల హైడ్రామా..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల పోలింగ్ వేళ గుంటూరు జిల్లాలో తీవ్ర రాజకీయ, అధికారిక హైడ్రామా చోటుచేసుకుంది. జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎన్నికల నిర్వహణపై కొద్దిసేపటి వ్యవధిలోనే అధికారులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో అభ్యర్థులు, ఓటర్లు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. తుఫాన్ ప్రభావం వల్ల రాకపోకలకు ఏర్పడిన తీవ్ర ఆటంకాలే ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా మారాయి.
ప్రస్తుతం ఏపీని వణికిస్తోన్న ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా మారాయి. పోలింగ్ కేంద్రాలకు కనీసం ఎన్నికల సాగ్రిగిని, బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు కూడా రహదారులు సహకరించని పరిస్థితి ఏర్పడింది. దీంతో రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆమోదంతో మొదట ఈ మూడు మండలాల్లో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 5న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 6వ తేదీకి మారుస్తున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఎన్నికల వాయిదా ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఈ వ్యవహారంలో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తాజా వాతావరణ పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగించాలని స్పష్టం చేశారు. ఎస్ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో జిల్లా కలెక్టర్ తన మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రవాణా ఆటంకాలను అధిగమించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎన్నికల సామగ్రిని తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో కూడా రేపే ఎన్నికలు యథాతథంగా జరుగుతాయని తాజా ప్రకటన విడుదల చేశారు.







