అన్నీ తానై ట్రంప్ నడిపినా… రామస్వామికి నిరాశే…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతు పొందిన భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి, ఒహియో గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో ఓడిపోయారు. దీంతో అమీ ఆక్టన్ ఆ రాష్ట్రానికి గవర్నర్ గా ఎన్నికైన మొదటి మహిళగా నిలిచారు. ఈ ఎన్నికల్లో అమీ ఆక్టన్ 51 శాతానికి పైగా ఓట్లను సాధించగా, రామస్వామి 45 శాతానికి పైగా ఓట్లను పొందారు.
అయితే.. రామస్వామి తన ఓటమిని హుందాగా స్వీకరించారు. ఇది చాలా కఠినమైన పోటీ అని, కొన్ని సార్లు ఇరువైపులా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురయ్యాయని అన్నారు. ఆక్టన్ విజయవంతంగా ప్రజలకు సేవచేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటించారు.తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు.
అయితే.. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ రాజకీయ బృందాల నుండి అగ్రశ్రేణి వ్యూహకర్తలు సలహాలు ఇస్తున్నప్పటికీ రామస్వామి ఓటమిపాలయ్యారు. 2024లో రిపబ్లికన్ అధ్యక్ష నామినేషన్ కోసం ట్రంప్‌పై పోటీపడి విఫలమైన రామస్వామి, భారీగానే ఖర్చు చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంటోంది. తోటి బిలియనీర్లైన ఎలాన్ మస్క్, జెఫ్రీ యాస్ల నుండి కూడా ఆయన మిలియన్ల డాలర్ల విరాళాలు అందుకున్నారని చెప్పుకొచ్చింది.
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, రామస్వామి ఒక ప్రకటనను ప్రసారం చేయాలని నిర్ణయించుకోవడం విమర్శలకు దారితీసింది. ఆ ప్రకటనలో ఆక్టన్ తల్లి, డోన్నా ఆర్థర్, తన కుమార్తెను అబద్ధాలకోరు అని పేర్కొంటూ, ఓహియో ప్రజలు ఆమెకు ఓటు వేయవద్దని కోరారని మీడియా పేర్కొంది. ఫెడరల్ ప్రభుత్వాన్ని సమూలంగా సంస్కరించడానికి ఉద్దేశించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ‘ప్రభుత్వ సామర్థ్య విభాగం’ (Department of Government Efficiency) కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించడంలో రామస్వామి ఎలాన్ మస్క్‌కు సహాయపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో రామస్వామి టీమ్ అమీ యాక్టన్కు దూరమైన తల్లిపై రూపొందించిన యాడ్‌తో టార్గెట్ చేసింది. చిన్నతనంలో సవతి తండ్రి యాక్టన్పై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పిల్లల సంరక్షణ బాధ్యతలను (కస్టడీ) ఆమె కోల్పోయింది. వివేక్ రామస్వామి టీమ్ యాడ్‌పై ఓహియో రిపబ్లికన్ గవర్నర్ మైక్ డివైన్‌తో సహా పలు పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటనను ప్రశంసించగా, ఓహియోకు చెందిన వైస్-ప్రెసిడెంట్ జేడి వాన్స్ దీనిని సమర్థించడం గమనార్హం.వైద్యురాలు, కోవిడ్-19 సమయంలో రాష్ట్ర ఆరోగ్య డైరెక్టర్‌గా పనిచేసిన యాక్టన్.. జీవనవ్యయ భారం తగ్గింపు, మెరుగైన వైద్య సదుపాయాలను అందించడం వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, టెంట్లో గడిపిన బాల్య అనుభవాలను గుర్తుచేస్తూ శ్రామిక, మధ్యతరగతి ఓటర్లను ఆమె ఆకట్టుకున్నారు.
024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి డొనాల్డ్ ట్రంప్‌తో వివేక్ రామస్వామి పోటీపడి చివరకు ఆయనకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిత్వానికి పోటీపడిన 8 మందిలో భారత సంతతికి చెందిన రామస్వామి, నిక్కీ హేలీ ఉన్నారు. తొలి డిబేట్లో ఆయన ప్రసంగంతో అదరగొట్టారు. దీంతో ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ ఆశించిన మద్దతు రాకపోవడంతో వెనక్కి తగ్గి, ట్రంప్‌నకు జైకొట్టారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్లో బెర్తు దక్కింది. గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్సీ (డోజ్) హెడ్‌గా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌తో పాటు రామస్వామిని నియమించారు. కానీ, ట్రంప్ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే డోజ్ నుంచి రామస్వామి తప్పుకున్నారు. ఓహియో రాాష్ట్రం నుంచి గవర్నర్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలనే ఉద్దేశంతోనే ఆయన డోజ్ నుంచి తప్పుకున్నట్టు అంతర్జాతీయ మీడియా నివేదించింది. మధ్యంతర ఎన్నికల్లో రామస్వామి తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. నిరాశ ఎదురైంది.







