ఎన్నికల్లో గెలుపొంది.. పెద్ద చరిత్రే సృష్టించిన పియా దాండియా
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు ప్రభంజనం సృష్టిస్తున్నారు. చరిత్రను కూడా నెలకొల్పుతున్నారు. ఫ్లోరిడా 22 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ నుంచి బరిలో నిలిచిన డెమోక్రాటిక్ అభ్యర్థి పియా దాండియా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిన కేసీ అస్కర్ ని ఓడించారు. ఫ్లోరిడా నుంచి అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర నెలకొల్పారు.మొత్తం ఓట్లలో పియా దాండియాకి 51.9 శాతం, కేసీ అస్కర్ కి 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.
ఈ విజయంతో ఫ్లోరిడా నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా పియా దాండియా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అమెరికా కాంగ్రెస్ లో అడుగుపెట్టిన పదో భారతీయ అమెరికన్ గా నిలిచారు. తొలుత ఫ్లోరిడాలోని 21 వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ నేత బ్రియాన్ మాస్ట్ పై పోటీ చేయాలని పియా భావించారు. అయితే.. ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకొని 22 వ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
ఇవి కూడా చదవండి
పామ్ బీచ్ కౌంటీలో పుట్టి పెరిగిన పియా దాండియా తొలుత టీచర్ గా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత న్యూయార్క్ లోని హార్లెమ్ లో హైస్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్య, ఆర్థిక స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో ఓ పాఠశాలను కూడా స్థాపించారు.







