చంద్రబాబు సొంత నియోజకవర్గం.. కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సొంత నియోజకవర్గంలోని చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ (Kuppam Municipality)లో టీడీపీ అభ్యర్థులు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 32 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్షంగా క్లీన్ స్వీప్ చేశారు. టీడీపీ కి 15,536 ఓట్ల ఆధిక్యం దక్కడంతో తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. టీడీపీ అభ్యర్థి రాజ్‌కుమార్‌కు 22,622 కోట్లు, వైసీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ కు 7,086, నోటాకు 454, కాంగ్రెస్‌కు 259, బీఎస్పీకి 148, ఇద్దరు స్వతంత్రులకు కలిపి 90 ఓట్లు వచ్చాయి. 576 ఓట్లు చెల్లలేదు.
పోటీ తీవ్రంగా ఉంటుందని భావించిన ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)కి తీవ్ర పరాభవం ఎదురైంది. కుప్పం పరిధిలోని 32 వార్డుల్లో వైసీపీ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఖాతా కూడా తెరవలేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ ఛాయలు అలముకున్నాయి. కుప్పంలో సాధించిన ఈ ఘన విజయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. లెక్కింపు కేంద్రం వెలుపల, కుప్పం పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.







