కొంప ముంచిన యాడ్.. రామస్వామి ఓటమి స్వయంకృతం..!
డొనాల్డ్ ట్రంప్ ఫాలోవర్.. భారత సంతతి కుబేరుడు వివేక్ రామస్వామికి(VIVEK RAMASWAMY).. మిడ్ టర్మ్ ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. ఒహాయో గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అమీ యాక్టన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రత్యర్థిపై చేసిన ఒక వివాదాస్పద ప్రచార ప్రకటన (యాడ్) ఆయన ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ యాడ్‌ను సొంత రిపబ్లికన్ పార్టీలోని కీలక నేతలు కూడా తీవ్రంగా విమర్శించడం గమనార్హం.
ఫార్మా రంగంలో వేల కోట్లు సంపాదించిన వివేక్ రామస్వామి (ఫోర్బ్స్ అంచనా ప్రకారం సంపద 2.2 బిలియన్ డాలర్లు), ఈ ఎన్నికల ప్రచారం కోసం తన సొంత నిధుల నుంచి సుమారు 79 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 749కోట్లు) ఖర్చు చేశారు. ప్రైవేట్ జెట్‌లో రాష్ట్రమంతా పర్యటిస్తూ, ట్రంప్ తరహా దూకుడైన ప్రచార శైలితో ముందుకెళ్లారు. అయితే, ఆయన ప్రత్యర్థి, డాక్టర్ అయిన అమీ యాక్టన్పై రూపొందించిన ఒక యాడ్ తీవ్ర వివాదాన్ని రాజేసింది.
చిన్నతనంలో తన సవతి తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు అమీ యాక్టన్ గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా అమీతో సంబంధాలు లేని ఆమె తల్లిని వివేక్ ప్రచార బృందం వెతికి పట్టుకుంది. తన భర్త మంచివాడని, అమీ అబద్ధం చెబుతోందని ఆమెతో చెప్పించి ఒక యాడ్‌ను రూపొందించారు.
ఈ యాడ్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించినప్పటికీ, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి మద్దతుగా దీనిని చిత్రీకరించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒహాయో రిపబ్లికన్ గవర్నర్ మైక్ డీవైన్తో సహా పలువురు నేతలు దీనిని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యతిరేకత యాక్టన్కు మద్దతుగా మారింది.
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన వివేక్, హార్వర్డ్‌లో చదివిన తర్వాత వ్యాపారంలో వేగంగా ఎదిగారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీ చేసి, తర్వాత వెనక్కి తగ్గి ఆయనకే మద్దతు ప్రకటించారు. అనంతరం ట్రంప్ ప్రభుత్వం, ఎలాన్ మస్క్‌తో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వ సామర్థ్య విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టినా, విభేదాల కారణంగా తప్పుకుని గవర్నర్ రేసులో నిలిచారు.







