రష్యా సైన్యంలో చిక్కుకున్న ఐదుగురిని వాపస్ తెప్పించాలి
◉ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యానికి విజ్ఞప్తి
మామూలు ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్లిన ఐదుగురు తెలంగాణ యువకులు, మోసపూరితంగా అక్కడి సైన్యంలోకి భర్తీ చేయబడ్డారని, ఉక్రేన్ తో జరిగే యుద్ధంలో వీరిని ‘ఫ్రంట్ లైన్’ దళాలో నియమించారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు.
వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
రష్యాలో చిక్కుకున్న దొమ్మాటి కిషన్ (రాజన్న సిరిసిల్ల జిల్లా), ముక్కెర రాజ్‌కుమార్ (జగిత్యాల జిల్లా), సుప్పన్ స్వామి (కామారెడ్డి జిల్లా), ఎడవెల్లి కనకయ్య (కరీంనగర్ జిల్లా), పోతరాజు విజయకృష్ణ (వరంగల్ జిల్లా) ల కుటుంబ సభ్యులు సహాయం కోసం ఇటీవల హైదరాబాద్ లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు.
మధ్యవర్తులు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వీరు రష్యాకు వెళ్లారు. ఇందుకోసం ఒక్కొక్క కుటుంబం సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేసింది. అయితే, హామీ ఇచ్చిన ఉద్యోగాలకు బదులుగా, రష్యా పౌరసత్వం ఇచ్చి సైన్యంలో భర్తీ చేశారని వారు వాపోయారు.
బాధిత కుటుంబాలు సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి, నోడల్ అధికారి కె. విద్యాసాగర్, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ ప్రక్రియలో బాధిత కుటుంబాలతో సమన్వయం చేసి, అవసరమైన పత్రాల సేకరణ నుంచి వినతిపత్రాల సమర్పణ వరకు సీఎం ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్ గంగుల మురళీధర్ రెడ్డి సహకరించారు. ఈ కార్యక్రమంలో లైజన్ ఆఫీసర్ తనీష్ మునుగోటి, వాలంటీర్ జయశ్రీ గూడూరి తదితరులు పాల్గొన్నారు.







