AB Venkateswara Rao: సోషల్ మీడియాలో భారీ హైప్.. ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు..ఏబీవీకి షాకిచ్చిన ఓటర్లు..
రాజకీయాల్లో గుర్తింపు రావడం వేరు.. ప్రజల నుంచి ఓట్లు సంపాదించడం వేరు. అధికార యంత్రాంగంలో ఉన్నత స్థానాల్లో పనిచేసినంత మాత్రాన ఎన్నికల బరిలోనూ అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని చెప్పలేం. ఇందుకు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) పోటీ చేసిన విజయవాడ (Vijayawada) మేయర్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఆయనపై జరిగిన ప్రచారం చూస్తే గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయన్న అభిప్రాయం కలిగింది. కానీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది.
ఏబీ వెంకటేశ్వరరావు పేరు సాధారణ ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోయినా, పోలీసు, రాజకీయ, అధికార వర్గాల్లో మాత్రం ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో వైసీపీ ప్రభుత్వంతో వివాదాలు, రాజకీయ పరిణామాల కారణంగా ఆయన పేరు తరచూ వార్తల్లో వినిపించింది. పదవీ విరమణ తర్వాత కూడా రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొంటూ పలు ప్రజా సమస్యలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ఆసక్తి కొంతకాలంగా కనిపించింది.
ఇవి కూడా చదవండి
అయితే నేరుగా విజయవాడ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం మాత్రం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అక్కడ రెండు ప్రధాన రాజకీయ శక్తులకు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో ఆయనకు గెలుపు అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఏబీవీ పోటీతో ఎన్నికల సమీకరణాలు మారిపోతాయని ప్రచారం సాగింది. ప్రధాన పార్టీల ఓట్లను ఆయన చీల్చడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేయగలరనే చర్చ కూడా జరిగింది.
ఈ ఎన్నికల్లో కూటమి తరఫున వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna), వైసీపీ తరఫున మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి (Rayana Bhagya Lakshmi) పోటీలో నిలిచారు. ఒకవైపు కూటమి రాజకీయ బలం, మరోవైపు వైసీపీకి ఉన్న సంప్రదాయ ఓటు మద్దతు మధ్య ఏబీవీ తనకంటూ ప్రత్యేక ఆదరణ సంపాదించుకోవాల్సి వచ్చింది. కానీ ఆన్లైన్లో కనిపించిన ఉత్సాహం పోలింగ్ కేంద్రాల దగ్గర ఓట్లుగా మారలేదు.







