అమిత్ షా టూర్‌తో ‘మిషన్ తెలంగాణ’ షురూ?
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ, ఇప్పుడు ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన, ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. త్వరలోనే మరికొంతమంది అగ్రనేతలు కూడా రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇకపై తెలంగాణ కేంద్రంగా బీజేపీ అగ్రనాయకత్వం రాజకీయం చేయబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అమిత్ షా పర్యటన ఇందుకు నాంది పలికిందని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో అమిత్ షా పర్యటించడం కేవలం యాదృచ్ఛికం కాదని, ఇదొక రాజకీయ వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేసిన మరుసటి రోజే అమిత్ షా హైదరాబాద్‌లో ప్రత్యక్షమవడం ద్వారా ఆ పార్టీకి గట్టి సంకేతాలే పంపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బషీర్‌బాగ్ నుంచి ఎంజే మార్కెట్ వరకు సాగిన మహా పాదయాత్రలో పాల్గొనడం, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం.. లాంటివి పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చాయి. అంతకుమించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన నేరుగా యుద్ధభేరి మోగించారు. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయడానికి, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఈ టూర్ వేదికైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరోవైపు.. కొంతకాలంగా రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాలు నెమ్మదించాయన్న అభిప్రాయాలకు చెక్ పెట్టేలా పార్టీ ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పావులు కదుపుతున్నారు. రాబోయే ఆరు నెలల్లో రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణంలో విప్లవాత్మక మార్పులు ఉంటాయని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికలకు చాలా ముందుగానే గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడం బీజేపీ నైజం. అందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు ఇతర సీనియర్ జాతీయ నేతలు సైతం వరుసగా రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ వేదికగా జరగనున్న మహా పాదయాత్రతో పాటు రానున్న రోజుల్లో దూకుడు పెంచాలని కాషాయ దళం భావిస్తోంది.
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తామే అధికారంలోకి వస్తామన్న ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, వచ్చే అసెంబ్లీ సమరానికి ఇప్పటినుంచే రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, స్థానిక ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వ్యూహాన్ని అమలు చేయనున్నారు. మొత్తం మీద అమిత్ షా తాజా టూర్‌తో తెలంగాణ పిచ్‌పై బీజేపీ అసలుసిసలు బ్యాటింగ్ షురూ చేసిందనే చెప్పాలి.







