జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోడీ మా టార్గెట్.. రాహుల్ సంచలన కామెంట్స్..!
వోట్ చోరీ, ఎస్ఐఆర్ అవకతవకలపై నిరంతరపోరాటం చేస్తున్న ఇండీ కూటమి.. తన టార్గెట్ పై క్లియర్ కట్ సందేశమిచ్చింది. తమ తొలి టార్గెట్.. మోడీ, షాల వ్యూహాలను అమలు చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అని తేల్చి చెప్పింది.జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత తమ పోరాటం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఉంటుందని తేల్చి చెప్పారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘జ్ఞానేశ్ కుమార్ తర్వాత మీ వంతే మోడీజీ’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి హెచ్చరించారు. జ్ఞానేశ్ కుమార్ లేకపోతే మోడీ ప్రధాని, అమిత్ షా హోంమంత్రి అయ్యేవారు కాదని వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంల ద్వారా కూడా ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
2024 ఎన్నికల తర్వాత దేశంలోని 15 శాతం మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని రాహుల్ పేర్కొన్నారు. ఆ ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరిగాయని, ప్రజల తీర్పును దొంగిలించారని ఆరోపించారు. ఓటర్ల పేర్ల తొలగింపు దేశద్రోహంతో సమానమని, ఇది అత్యంత తీవ్రమైన కేసుల్లో ఒకటని అభివర్ణించారు. ఈ ఆరోపణలకు ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాలే ఆధారమని చెప్పారు.
అందరూ స్వేచ్ఛగా జీవిస్తూ, తమ కష్టానికి తగిన ఫలితం పొందే భారతదేశం కావాలని ఆకాంక్షించారు. తనకు మతం కంటే ప్రతి భారతీయుడి గొంతుకే ముఖ్యమని చెప్పారు. మోడీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్లపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయబోమని అన్నారు. ప్రేమ, అహింస మార్గంలోనే పోరాడతామని, అయితే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మాత్రం అనుమతించబోమని హెచ్చరించారు.







