ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పంజా..!
దేశంలో ప్రముఖ క్యాన్సర్ కేర్ ఆసుపత్రి నెట్వర్క్ అయిన “ఒమేగా హాస్పిటల్స్” (Omega Hospitals) లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు భారీ దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత, ఆదాయాన్ని తక్కువగా చూపించడం మరియు పెద్ద ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు జరిగాయనే పక్కా సమాచారంతో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ వంటి ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 24 ప్రాంతాలలో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ భారీ సోదాలు హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ వింగ్ నేతృత్వంలో కొనసాగుతున్నాయి. ఒమేగా హాస్పిటల్స్‌కు చెందిన వివిధ బ్రాంచ్‌లతో పాటు, మేనేజ్మెంట్లో కీలక బాధ్యతల్లో ఉన్న ప్రముఖ వైద్యుల నివాసాలు, వారి వ్యక్తిగత కార్యాలయాల్లో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఆసుపత్రి గ్రూపునకు సంబంధించిన కీలక ప్రమోటర్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను, వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లను అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు భారీగా కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ డేటా మరియు గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
అకౌంట్ బుక్స్‌లో చూపించని నిధుల మళ్లింపు, విదేశీ పెట్టుబడులు మరియు నగదు రూపంలో జరిగిన భారీ ఫైనాన్షియల్ డీల్స్‌పై ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యం వైద్య సేవలకు వసూలు చేసిన ఫీజులు, వాటికి చెల్లించిన పన్నుల లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఒమేగా హాస్పిటల్స్ నెట్వర్క్ డైరెక్టర్లు, సీనియర్ అకౌంటెంట్లు మరియు ఫైనాన్షియల్ అడ్వైజర్లను కూడా ఐటీ అధికారులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. డిజిటల్ నెట్‌వర్క్‌లను సిజ్ చేసి హార్డ్ డిస్క్‌లలో ఉన్న గుప్త సమాచారాన్ని రికవర్ చేసే పనిలో టెక్నికల్ టీమ్స్ నిమగ్నమయ్యాయి. ఈ సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో, తనిఖీలు ముగిసిన తర్వాత పట్టుబడిన బినామీ ఆస్తులు, లెక్కల్లో చూపని నగదు మరియు పన్ను ఎగవేతపై ఐటీ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.








