కాంగ్రెస్ కు సున్నా ఫలితాలు.. మోడీ పదునైన సెటైర్..!
వోట్ చోరీ.. సీఈసీపై ఆరోపణలు పర్వం.. కట్ చేసే ..వారం రోజులకు పైగా ఢిల్లీలో ఆందోళనలు.. నవంబర్ 1 న రామ్ లీలా మైదానంలో ఇండీకూటమి భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తగ్గేదే లేదు.. సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. అంటూ కాంగ్రెస్ అలయెన్స్ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. అయితే ఇదే తరుణంలో నాలుగు రాష్ట్రాల్లో జరిగిన 28 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు షాకిచ్చాయి. ఇక్కడ ఈవీఎంలకు బదులు బ్యాలెట్ వాడారు. అయినా కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు.
నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన 12 స్థానాల్లో ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు ఆ పార్టీకి నిరాశను మిగిల్చాయి. గతంలో ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కూడా నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ.. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందో ఊహించండి?’ అంటూ ఎమోజీతో చేసిన వ్యాఖ్య ద్వారా ఆయన వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగాయన్న అంశాన్ని కూడా ప్రస్తావించడంతో రాజకీయ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.
మోడీ పోస్ట్‌లోని అసలు వ్యంగ్యం ఇదే! ఎన్నికల ఫలితాలపై ఈవీఎంలను ప్రశ్నించే కాంగ్రెస్‌కు, బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల్లోనూ విజయం దక్కకపోవడం ఆయన సెటైర్‌కు ప్రధాన అంశమైంది. సీట్ల లెక్కలు అడిగినట్లు కనిపించినా.. సమాధానం మాత్రం అందరికీ తెలిసినదే అన్నట్లుగా మోడీ తన పోస్టుతో రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేశారు.
ఈవీఎంలు లేకపోతే సీట్లు వస్తాయనుకున్నారా?
ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా కారణాలను విశ్లేషించుకోవడం సహజం. కానీ ఈసారి కాంగ్రెస్‌కు మరో రకమైన ప్రశ్న ఎదురైంది. ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లే ఉన్నాయి.. మరి ఫలితం ఎందుకు మారలేదు? అన్న చర్చ మొదలైంది.
కర్ణాటకలోనూ కలిసిరాని అధికార బలం!
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీకి విజయం దక్కలేదని వచ్చిన ఫలితాలు మరింత చర్చకు దారితీశాయి. ప్రభుత్వం చేతిలో ఉండటం వేరు.. ఎన్నికల్లో ఓటర్ల మద్దతు సంపాదించడం వేరు అన్న విషయాన్ని ఈ ఫలితాలు మరోసారి గుర్తుచేశాయి.
అధికారం ఉందని ప్రతి ఎన్నికలోనూ విజయాలు దక్కుతాయనే హామీ లేదు. స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల ప్రాధాన్యతలు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనూ విజయం సాధించలేకపోవడం కాంగ్రెస్ నాయకత్వానికి ఆత్మపరిశీలన అవసరాన్ని సూచిస్తోంది.








