ఏపీలో లేని కరువు.. తెలంగాణలోనే ఎందుకు? : కేటీఆర్
తెలంగాణలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి “రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నట్లుగా” ఉందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో 365 కరువు మండలాలు ఉన్నాయని, ఇది కేవలం కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా వేయి టీఎంసీల నీటిని దిగువకు వదలడం వల్లే నేడు ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు. ఒకవైపు రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే, హైదరాబాద్‌లో తాగునీటి కొరత ఏర్పడి వాటర్ ట్యాంకర్ల సంఖ్య భారీగా పెరుగుతోందని, పరిశ్రమలు, ఐటీ కారిడార్‌కు ‘పవర్ హాలిడే’ ప్రకటించే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో లిఫ్టుల ద్వారా పొలాలకు నీళ్లొస్తే, నేడు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చే పరిస్థితికి వచ్చారంటూ మార్పు ఇదేనా అని ప్రశ్నించారు.
ప్రజలకు నీళ్లు లేని ఈ తరుణంలో రూ. 1.5 లక్షల కోట్ల అంచనాలతో మూసీ సుందరీకరణ చేపట్టడం వెనుక పెద్ద ఎత్తున లూటీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఎలాంటి డీపీఆర్ లేదని, అసలు ఎన్ని ఫేస్‌లు ఉంటాయో కూడా స్పష్టత లేదన్నారు. కరువు సమయంలో మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని తెచ్చి మూసీలో పోస్తామనడం “మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె” అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ అనే ఈ కార్యక్రమాన్ని తక్షణమే పక్కన పెట్టి, ఆ లక్షన్నర కోట్లను రైతాంగాన్ని ఆదుకునేందుకు మళ్లించాలని డిమాండ్ చేశారు.
మూసీ సుందరీకరణపై ఇటీవల నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌కు ప్రజలను, బాధితులను రానీయకుండా అడ్డుకున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది “పబ్లిక్ హియరింగ్ విత్ ఔట్ పీపుల్” లాగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? లేక అనుముల రాజ్యాంగం నడుస్తుందా? అని నిలదీశారు. బాధితుల తరఫున న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఎగ్గొట్టిన రైతు భరోసాతో పాటు, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 60 వేల పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ల పేరుతో హడావుడి చేయడం కాదని, పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలోకి పెట్టుబడులు ఎలా వస్తాయని, గడిచిన మూడేళ్లలో వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఏపీ సీఎం చంద్రబాబు కరువు సమయంలో ప్రతి నీటి చుక్కను వడిసిపట్టడాన్ని అభినందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేసిన ప్రజలు తీవ్రంగా మోసపోయారని పేర్కొన్నారు. కొండా సురేఖ అంశంపై లీగల్ టీంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.








