కేటీఆర్ వర్సెస్ బల్మూరి వెంకట్.. అసలేంటీ గొడవ?
తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు కొత్త కాదు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మధ్య నడుస్తున్న వివాదం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. వీళ్లద్దరి మధ్య రాజకీయ వైరం కాస్తా ఇప్పుడు ఇరువురి కుటుంబాలు, సోషల్ మీడియా ట్రోల్స్, న్యాయస్థానాల వరకు చేరింది.
కొద్దిరోజుల క్రితం కేటీఆర్ దుబాయ్ పర్యటన, వ్యక్తిగత ప్రయాణాల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు గుప్పించారు. కేటీఆర్ ‘రామ్ కేటీ’, ‘కే రామ్’ పేర్లతో దుబాయ్ వెళ్లారని, ఆ ప్రయాణంలో కొందరితో కలిసి వెళ్లారంటూ వెంకట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి చేరడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
బల్మూరి వెంకట్ కు కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాలో చెలరేగిపోయింది. బల్మూరి వెంకట్ ది మొదటి పెళ్లి కాదని, రెండో పెళ్లి అని ఆరోపించింది. రెండో వివాహం ఆయన ఎలా చేసుకున్నారో తెలుసా.. అంటూ సెటైర్లతో కూడిన పోస్టులు పెట్టింది. దీంతో బల్మూరి వెంకట్ సతీమణి ఇందూజా నేరుగా రంగంలోకి దిగారు. “ఓ ఎస్సీ యువతి, వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం తప్పా?” అంటూ ఆమె ప్రశ్నించారు. తమ వివాహ ఫొటోలను సోషల్ మీడియాలో వక్రీకరించి, తమపై ట్రోల్స్ చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రాజకీయంగా తన భర్తను ఎదుర్కోలేక ఇలా వ్యక్తిగత విషయాలను, పెళ్లి ఫొటోలను అడ్డం పెట్టుకుని ట్రోల్ చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు.
మరోవైపు, తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ కేటీఆర్ న్యాయపోరాటానికి దిగారు. బల్మూరి వెంకట్ తో పాటు అద్దంకి దయాకర్‌లపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు… కేటీఆర్‌పై ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, వివాదాస్పద ఆరోపణలకు సంబంధించిన కథనాలు, వీడియోలను తొలగించాలని మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది.
ఈ మొత్తం పరిణామాలు గమనిస్తే.. తెలంగాణ రాజకీయాలు పాలసీలు, ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియా వార్ వైపు మళ్లుతున్నాయని స్పష్టమవుతోంది. ఒకవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సైద్ధాంతిక పోరాటం ఉండాల్సింది పోయి.. నాయకుల వ్యక్తిగత జీవితాలు, వివాహాలు, కుటుంబ సభ్యులు ఈ రాజకీయ క్రీడలో పావులుగా మారుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ న్యాయపోరాటం, రాజకీయ మాటల యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.








