హాట్ టాపిక్‌గా జయేశ్ రంజన్ వీఆర్ఎస్ వ్యవహారం?
తెలంగాణ అధికారిక వర్గాలతో పాటు రాజకీయ సర్కిళ్లలోనూ ప్రస్తుతం ఒకే ఒక్క అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకోనున్నారన్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, పరిశ్రమల శాఖల్లో చక్రం తిప్పి, అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు రప్పించడంలో కీలక భూమిక పోషించిన ఆయన.. ఇప్పుడు వరుస పరిణామాల నేపథ్యంలో వీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్‌తో కలిసి జయేశ్ రంజన్ పనితీరు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర విశేషం. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు ప్రాధాన్యత దక్కింది. పెట్టుబడుల ఆకర్షణలో ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎంవోలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
కానీ.. కాలక్రమేణా పరిణామాలు మారుతూ వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్‌లో ఐటీ శాఖ నుంచి సీఎంవోకు బదిలీ అయిన ఆయన, ఆ తర్వాత డిసెంబర్లో హెచ్ఎండీఏకు, తాజాగా పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఇంత తక్కువ కాలంలోనే ఇన్ని శాఖలు మారడం, గతంలో నిర్వహించిన క్రీడలు, హెరిటేజ్ అదనపు బాధ్యతలు తొలగించడంతో సెక్రటేరియట్ కారిడార్‌లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కీలకమైన పెట్టుబడుల బాధ్యతలు దూరమవ్వడం, ఆయన ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.
2026 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం జరిగింది. ఆ సమయంలో జయేశ్ రంజన్ పేరు పరిశీలనలో ఉందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ, ప్రభుత్వం మాత్రం సంజయ్ జాజును ఆ పదవికి ఎంపిక చేసింది. ఈ నియామకంపై ఆయన కొంత అసంతప్తితో ఉన్నట్లు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 2027లో పదవీ విరమణ చేయాల్సిన ఆయన, ముందే సర్వీసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడానికి ఈ పరిణామాలు కూడా కారణమై ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు.. ఈ వీఆర్ఎస్ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగానికి వీడ్కోలు పలికిన అనంతరం, ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఉన్నత స్థాయి బాధ్యతలు చేపట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం వస్తోంది. అయితే, ఆయన ఏ సంస్థలో చేరబోతున్నారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అధికారిక నిబంధనల ప్రకారం వీఆర్ఎస్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వం దానిని ఆమోదించే ప్రక్రియ తదితర అంశాలపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కేటీఆర్ హయాంలో అత్యంత కీలకమైన శాఖలను పర్యవేక్షించిన కీలక అధికారి, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించి ఇప్పుడు వీఆర్ఎస్ బాట పట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న ఉన్నతాధికారుల ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోందనే విమర్శలను బీఆర్ఎస్ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అనుభవానికి తగినట్లుగా సీఎంవోలోనూ అత్యున్నత బాధ్యతలు అప్పగించిందని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కెరీర్ గ్రాఫ్‌లో వస్తున్న ఈ మార్పులు, వీఆర్ఎస్ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.








