Rice: ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు.. కొనేదెలా?
అన్నదాత కష్టపడి పండించిన ధాన్యం సామాన్యుడికి అందేసరికి కోట్ల రూపాయల వ్యాపారంగా మారుతోంది. దేశానికి అన్నం పెట్టడంలో ముందంజలో ఉన్న తెలంగాణలోనే ఇప్పుడు బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రిటైల్ మార్కెట్లో బియ్యం ధరలు కిలో రూ.100 మైలురాయిని దాటేశాయి. నాణ్యమైన సన్న రకాల బియ్యం ధరలు ఏకంగా సెంచరీ కొట్టడంతో సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ప్రముఖ సన్న రకం బియ్యం అయిన ‘జై శ్రీరామ్’ రిటైల్ మార్కెట్లో కిలో రూ.101 పలుకుతోంది. అంటే క్వింటాల్‌కు ఏకంగా రూ.10,100 వరకు చేరింది. కేవలం జై శ్రీరామ్ మాత్రమే కాదు, హెచ్ఎంటీ బియ్యం క్వింటాల్ రూ.9,000 ఉండగా, సాధారణ రకం పచ్చి బియ్యం రూ.9,000 నుండి రూ.9,500 వరకు అమ్ముడవుతున్నాయి. ఇక తెలంగాణ ప్రత్యేక వరి వంగడమైన ‘ఆర్ఎన్ఆర్’ రకం కూడా క్వింటాల్‌కు రూ.9,100 పలుకుతోంది. హోల్‌సేల్ మార్కెట్ ధరలతో పోలిస్తే రిటైల్ మార్కెట్లలో కిలోకు రూ.5 నుంచి రూ.20 వరకు అధికంగా విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలు పెరిగితే సర్దుకోవచ్చు కానీ, నిత్యం తినే అన్నం ధరలే ఇలా అడ్డగోలుగా పెరిగితే బతుకేదెలా అని వినియోగదారులు వాపోతున్నారు.
ధరలు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మేల్కొనడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ధరలు అకాశాన్నంటిన తర్వాత బుధవారం నాడు పౌరసరఫరాల శాఖ అధికారులు హడావుడిగా రంగంలోకి దిగారు. మిర్యాలగూడ, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాలకు చెందిన ప్రముఖ రైస్ మిల్లు యజమానులు, హోల్‌సేల్ వ్యాపారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాక్ అంతా గడచిన యాసంగి సీజన్‌కు చెందినదేనని, వ్యాపారులు అక్రమాలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. అయితే, మార్కెట్లో ఇప్పటికే ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన తర్వాత ఈ హెచ్చరికలు చేయడం కేవలం మొక్కుబడి తంతులాగే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వినియోగదారులపై అదనపు భారం పడకుండా చూడటమే తమ ప్రాధాన్యమని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆచరణలో అది ఎంతవరకు అమలువుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణలో సన్న బియ్యం ధరలు ఈ స్థాయిలో ఎగబాకడానికి అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్ని సీజన్లుగా రైతులు సన్న వరి రకాల కంటే మద్దతు ధర లభించే దొడ్డు రకాల వైపు మొగ్గు చూపడం లేదా వాణిజ్య పంటల సాగును ఎంచుకోవడం వల్ల సన్న బియ్యం ఉత్పత్తి కొంత మేర తగ్గింది. గత సీజన్లలో అనూహ్య వర్షాలు, వర్షాభావ పరిస్థితులు దిగుబడిపై ప్రభావం చూపాయి. మిల్లు యజమానులు, హోల్‌సేల్ వ్యాపారులు డిమాండ్‌ను బట్టి కృత్రిమ కొరతను సృష్టించి స్టాక్‌ను రహస్యంగా నిల్వ చేయడం వల్ల ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి.
ఒకవైపు కూలి నాలి చేసుకునే బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే, ఇప్పుడు బియ్యం ధరలు కూడా వంద దాటడం వారి నడ్డి విరుస్తోంది. ప్రభుత్వం కేవలం సమావేశాలు, హెచ్చరికలతో సరిపెట్టకుండా, మార్కెట్‌పై నిరంతర నిఘా ఉంచాలి. అక్రమ నిల్వలను నిరోధించి, పేదలకు సరసమైన ధరలకు బియ్యం లభించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఎంతైనా ఉంది. లేదంటే సామాన్యుడి పళ్లెంలో అన్నం కరువయ్యే ప్రమాదం లేకపోలేదు.








