కేటీఆర్‌కు ‘సారీ’ చెప్పిన కొండా సురేఖ… ఏంటి సంగతి?
తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇటీవలే బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ‘ఎక్స్’ వేదికగా క్షమాపణలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో తాను చేసిన వ్యక్తిగత, నిరాధారమైన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. ఆమె మళ్లీ బీఆర్ఎస్ లో చేరతారనే ఊహాగానాలకు ఈ క్షమాపణలు బలం చేకూరుస్తున్నాయి.
మంత్రిగా కొనసాగుతున్న సమయంలో కొండా సురేఖ కేటీఆర్‌ను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించడమే కాకుండా, తీవ్ర దుమారం రేపాయి. తన పరువుకు భంగం కలిగించారంటూ కేటీఆర్ ఆమెపై పరువునష్టం దావా కూడా వేశారు. అయితే, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి కొండా సురేఖను అనూహ్యంగా తొలగించడం రాజకీయంగా పెద్ద మలుపు తిప్పింది. సరైన వివరణ లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై ఆమె తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. “తాను బీసీ మహిళను కావడం వల్లే తనను మంత్రివర్గం నుంచి తప్పించారా?” అంటూ ఆమె బహిరంగంగానే కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో తనకు సముచిత గౌరవం దక్కలేదని, పార్టీ పెద్దలు తనను అన్యాయంగా బలి చేశారనే భావనలో కొండా సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె, ఆమె భర్త కొండా మురళి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పడం ఒక వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఉన్న విభేదాలను, న్యాయపరమైన చిక్కులను తొలగించుకుని, బీఆర్ఎస్ అధిష్టానంతో సయోధ్య కుదుర్చుకోవడానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తాను ప్రతిపక్ష రాజకీయ విమర్శల్లో భాగంగానే చేశానని, ఉద్దేశపూర్వకంగా కించపరిచే ఉద్దేశం లేదని ఆమె చెప్పడం ద్వారా, పాత విభేదాలను చెరిపేసే ప్రయత్నం చేశారు.
కొండా సురేఖ క్షమాపణల ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత, ఆమె భర్త కొండా మురళితో కలిసి త్వరలోనే తిరిగి బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. వరంగల్ జిల్లా రాజకీయాల్లో బలమైన సామాజిక వర్గ పట్టున్న కొండా దంపతులు మళ్లీ గులాబీ కండువా కప్పుకుంటే, అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
అయితే, ఈ పరిణామంపై బీఆర్ఎస్ అధిష్టానం గానీ, కేటీఆర్ గానీ స్పందించలేదు. పార్టీ నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే కొండా దంపతుల రీ-ఎంట్రీ లాంఛనప్రాయం కానుంది. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానం ఎదుర్కొన్నామని భావిస్తున్న కొండా సురేఖ.. తమ రాజకీయ మనుగడ కోసం ఏ నిర్ణయం తీసుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తుందా? లేదా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తానికి, ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త సమీకరణాలకు తెరలేపింది.








