ఇరాన్, హుతీలతో జాగ్రత్త.. మిత్రదేశాలకు అమెరికా హెచ్చరికలు..!
పశ్చిమాసియా మరింతగా మరుగుతోంది. ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్ర రూపు దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ ను దారికి తెచ్చుకునేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో.. మరోసారి భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. నవంబర్ 3న జరిగే మిడ్‌టర్మ్ ఎన్నికల (US Midterm) తర్వాత ఇరాన్‌పై దాడులు ఉండొచ్చని అమెరికా నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలోని మిత్రదేశాలకు అగ్రరాజ్యం హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ దాడులు కొన్నిరోజుల పాటు కొనసాగొచ్చని తెలుస్తోంది. అయితే, ఈ సరికొత్త సైనిక చర్య గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కానీ, మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులకు ఆదేశాలు ఇచ్చే విషయాన్ని తాను పరిశీలిస్తున్నానని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హింట్ ఇచ్చారు.
ఈ సంకేతాలకు తగ్గట్టుగా అమెరికా ముందుకు వెళితే.. గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలపై ఇరాన్ విరుచుకుపడే అవకాశం ఉంది. ఇప్పటికే టెహ్రాన్ దాడులతో యూఏఈ (UAE), సౌదీ అరేబియా (Saudi Arabia) సహా పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో ఈ చమురు సుసంపన్న దేశాల భవిష్యత్ ప్రణాళికలన్నీ ప్రమాదంలో పడ్డాయి.
మరోవైపు ఇరాన్ దౌత్య చర్యలకు ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. గత నెల తాము ప్రతిపాదించిన అంశాలపై మధ్యవర్తులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇరాన్ ప్రతిపాదనలను ఇప్పటికే ట్రంప్ తిరస్కరించారు. అయితే, మళ్లీ ఘర్షణలు తావులేకుండా ఇరువర్గాలు పరిష్కారాలపై దృష్టిసారించాలని యూఏఈ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో అభ్యర్థించింది.








