ఇజ్రాయెల్ హంగ్ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్.. మితవాద ప్రభుత్వం ఏర్పాటుకు బీబీ పిలుపు..!
ఇజ్రాయెల్ జాతీయ ఎన్నికల్లో అధికార నెతన్యాహు పార్టీ.. విపక్ష గాడి ఐసెన్ కోట్ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఈ ఉత్కంఠభరిత పోరులో బీబీ పార్టీ.. కొద్దిపాటి ఆధిక్యం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. మరోవైపు.. ఇదే సందర్భంగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు… కీలక ప్రకటన చేశారు. ప్రజలు మితవాదులు వైపు మొగ్గుచూపారన్న బీబీ.. ఇజ్రాయెల్ లో మితవాద ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు.
ఇజ్రాయెల్ లో ప్రభుత్వం ఏర్పాటుకు 61 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కాావాలి. కానీ.. 120 మంది సభ్యులున్న ఇజ్రాయెలీ పార్లమెంటు (నెస్సెట్)లో ఐసెన్కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమితో పోలిస్తే.. నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, ఇతర మిత్రపక్షాలతో కూడిన కూటమి కాస్త ముందంజలో ఉందని.. అయితే ఏపార్టీకి ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదని అంచనాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అరబ్ పార్టీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. గతంలో 10 సీట్లు గెలుచుకున్న ఈ పార్టీలు, ఈసారి 17 నుంచి 18 స్థానాలు సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.
హమాస్ దాడుల తర్వాత నెతన్యాహు నాయకత్వంపై రిఫరెండంగా ఈ ఎన్నికలను భావించారు. రికార్డు స్థాయిలో 77.7 శాతం పోలింగ్ నమోదైంది. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రతిపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది నెతన్యాహు ప్రభుత్వంపై ప్రజల అవిశ్వాసానికి నిదర్శనమని ఐసెన్కోట్ వ్యాఖ్యానించగా, నెతన్యాహు కూటమికి ఇది ఘోర పరాజయమని ప్రతిపక్ష నేత యైర్ లాపిడ్ అన్నారు. అరబ్ పార్టీల నేతలు తమ ఫలితాలను “చరిత్రాత్మక విజయం”గా అభివర్ణించారు.
ఈ ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వారాల తరబడి కొనసాగే అవకాశం ఉంది. అధికారికంగా పూర్తి ఫలితాలు వెలువడటానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. అనంతరం, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ ఏర్పాటుకు ఒక నేతను ఆహ్వానిస్తారు. ఈ ప్రక్రియకు 42 రోజుల వరకు సమయం పట్టవచ్చు. అప్పటివరకు నెతన్యాహు తాత్కాలిక ప్రధానిగా కొనసాగే అవకాశం ఉంది.








