బ్రేకింగ్ బ్యాడ్.. ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కార్ పై డీఎంకే ఎటాక్..!
తమిళనాడు నూతన ప్రభుత్వానికి ఇప్పటికీ శాంతిభద్రతలపై పట్టు చిక్కలేదా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తోంది.ఇటీవలే ఆ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుపడగా.. ఇప్పుడు తేనిలోని జైలు నుంచి ఖైదీలు పారిపోయారు. వీటిపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్న ‘బ్రేకింగ్ బ్యాడ్’(BREAKING BAD).. ఇప్పుడు ‘ప్రిజన్ బ్రేక్’ (PRISON BREAK) అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రముఖ వెబ్ సిరీస్‌ల పేర్లతో రాష్ట్రంలోని శాంతి భద్రతలను పోల్చారు స్టాలిన్ (Vijay-MK Stalin)
‘‘తమిళనాడులో ‘బ్రేకింగ్ బ్యాడ్’ తర్వాత ‘ప్రిజన్ బ్రేక్’ మొదలైంది. బెయిల్‌పై బయట ఉన్న నేరస్థులనే పర్యవేక్షించడం లేదనుకున్నాను. జైలులో ఉన్న ఖైదీలు తప్పించుకుంటున్నా ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చుంటోంది. ఇప్పటికే పుళల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన మరవకముందే.. ఇప్పుడు తేని జైలు నుంచి 17 మంది పారిపోయారు (Theni jailbreak). 1995 తర్వాత ఒకేసారి ఇంతమంది ఖైదీలు పారిపోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. భద్రతా ఏర్పాట్లు, మెరుగైన సాంకేతికత ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. బయట ఉన్న నేరగాళ్లు స్వేచ్ఛగా నేరాలు చేస్తున్నారు. లోపల ఉన్న ఖైదీలు ధైర్యంగా తప్పించుకుంటున్నారు. మొత్తం మీద ఎవరికీ ఉపయోగపడని ప్రభుత్వం మనది. వారు ప్రజలను రక్షించరు. ప్రజలే తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితికి తమిళనాడు చేరింది’’ అని ఎక్స్‌లో స్టాలిన్ (MK Stalin) తీవ్ర విమర్శలు చేశారు.
రూ.100 కోట్ల విలువైన 135 కిలోల డ్రగ్స్ అక్రమ రవాణా చేసిన కేసులో ఇటీవల నాగపట్టణానికి చెందిన టీవీకే నేత ఒకరు అరెస్టయ్యారు. దానిపై స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. బ్రేకింగ్ బ్యాడ్ అనే వెబ్‌సిరీస్ (డ్రగ్స్ తయారీ ఆధారంగా తీసిన సిరీస్)ను ప్రస్తావిస్తూ.. టీవీకే ‘బ్యాడ్ పార్టీ’ మాత్రమే కాదని, ‘బ్రేకింగ్ బ్యాడ్ పార్టీ’ అని వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన పోస్టులో దీనితోపాటు మరో వెబ్ సిరీస్ ‘ప్రిజన్ బ్రేక్’ పదాన్ని ప్రస్తావించారు.








