అమెరికాలో భారతీయుల ఓటు హక్కు వెనుక ఓ పంజాబీ పోరాటం! 100 ఏళ్ల క్రితమే మొదలైన కథ ఇది!
అమెరికాలో భారతీయులు ఓటర్లుగా మారడం, చట్టసభల్లోకి అడుగుపెట్టడం వెనుక ఒకప్పుడు పెద్ద పోరాటమే జరిగింది. ఆ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పేరు సర్దార్ జగ్జీత్ సింగ్. స్నేహితులు ఆయనను జేజే సింగ్ (JJ Singh) అని పిలిచేవారు. వ్యాపారం కోసం అమెరికాకు వెళ్లిన ఆయన.. అక్కడ భారతీయులకు పౌరసత్వం కల్పించే చట్టం కోసం రాజకీయ నాయకుల తలుపులు తట్టారు. చివరకు ఆయన కృషి ఒక చారిత్రక చట్టానికి బాటలు వేసింది. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు కీలకంగా మారిన నేపథ్యంలో, దశాబ్దాల క్రితం సాగిన ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది.
అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు ఇప్పుడు రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతున్నాయి. అక్కడి చట్టసభల్లో భారతీయ మూలాలున్న నాయకులు కనిపిస్తున్నారు. లక్షలాది మంది భారతీయ అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అమెరికాలో భారతీయులు నివసిస్తున్నా, ఆ దేశ పౌరసత్వం పొందడం అంత సులభం కాదు. ఈ పరిస్థితిని మార్చేందుకు దాదాపు 80 ఏళ్ల క్రితం ఒక భారతీయుడు అమెరికా రాజకీయ నాయకులతో పోరాటం చేశారు. వ్యాపారం కోసం అమెరికాకు వెళ్లిన ఆ వ్యక్తి.. చివరకు భారతీయులకు పౌరసత్వం కల్పించే చట్టం రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పేరు జేజే సింగ్ (JJ Singh).
పౌరసత్వానికి అడ్డుకట్ట వేసిన తీర్పు
1923లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన United States v. Bhagat Singh Thind తీర్పు భారతీయుల పౌరసత్వ హక్కులకు పెద్ద అడ్డంకిగా మారింది. భగత్ సింగ్ థింద్ అనే భారతీయుడికి సహజీకరణ ద్వారా అమెరికా పౌరసత్వం పొందే అర్హత లేదని కోర్టు నిర్ణయించింది. దీంతో అమెరికాలో స్థిరపడిన భారతీయులకు పౌరసత్వం పొందే అవకాశాలు పరిమితమయ్యాయి.
ఈ పరిస్థితిని మార్చాలంటే కోర్టు తీర్పును విమర్శించడం ఒక్కటే సరిపోదని జేజే సింగ్ గుర్తించారు. అమెరికా కాంగ్రెస్ చట్టాన్ని మార్చేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతంగా పౌరసత్వం పొందడం కంటే, అమెరికాలోని భారతీయులందరికీ ఆ అవకాశం కల్పించడమే ఆయన లక్ష్యంగా మారింది.
వ్యాపారంలో ఎదుగుతూ.. హక్కుల కోసం పోరాడుతూ
1897 అక్టోబర్ 5న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని రావల్పిండిలో జన్మించిన జేజే సింగ్, యువకుడిగా ఉన్నప్పుడు పంజాబ్‌లోని రాజకీయ పరిణామాలను దగ్గరగా చూశారు. తర్వాత బ్రిటన్‌కు వెళ్లిన ఆయనకు న్యాయశాస్త్రం కంటే వ్యాపారంపై ఆసక్తి పెరిగింది. భారతీయ పట్టు వస్త్రాలు, చేనేత ఉత్పత్తులను విదేశాల్లో విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించారు.
1926లో ఫిలడెల్ఫియాలో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలో భారతీయ ఉత్పత్తులను పరిచయం చేసేందుకు అమెరికాకు వెళ్లారు. అక్కడ వ్యాపారాన్ని విస్తరించి, ఫిలడెల్ఫియాతో పాటు న్యూయార్క్‌లోనూ దుకాణాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా న్యూయార్క్‌లోని ఫిఫ్త్ అవెన్యూలో ఆయన నిర్వహించిన వస్త్ర వ్యాపారం ద్వారా అమెరికాలోని ప్రముఖ వర్గాలతో పరిచయాలు పెరిగాయి.
ఈ పరిచయాలను ఆయన కేవలం వ్యాపార ప్రయోజనాలకే పరిమితం చేయలేదు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు కూడగట్టడంతో పాటు, అమెరికాలో భారతీయులకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో పనిచేశారు. ఇండియా లీగ్ ఆఫ్ అమెరికాలో చురుగ్గా పాల్గొని, 1941లో ఆ సంస్థ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
వాషింగ్టన్లో మొదలైన అసలు పోరాటం
జేజే సింగ్‌కు ఒక విషయం స్పష్టంగా తెలుసు. భారతీయుల సమస్యలను వారి మధ్య చర్చించుకోవడం వల్ల మాత్రమే అమెరికా చట్టాలు మారవు. అందుకే రచయితలు, పౌరహక్కుల కార్యకర్తలు, శాంతి ఉద్యమకారులు, రాజకీయ నాయకులను తన ప్రయత్నాల్లో భాగస్వాములను చేశారు. వాషింగ్టన్ డీసీలో ఇండియా లీగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, కాంగ్రెస్ సభ్యులతో నేరుగా సంప్రదింపులు జరిపారు.
భారతదేశంలో బ్రిటిష్ పాలన, బెంగాల్ కరువు, స్వాతంత్య్ర పోరాటం వంటి అంశాలపై అమెరికాలో అవగాహన కల్పించడంతో పాటు, భారతీయులకు పౌరసత్వం కల్పించాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లారు. చట్టం మారాలంటే కాంగ్రెస్‌లో మద్దతు అవసరమని భావించి, వివిధ రాజకీయ వర్గాల నాయకులతో సంబంధాలు పెంచుకున్నారు.
1946లో TIME పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన వేలాది ఉత్తరాలు రాశారు, వందలాది ఫోన్ కాల్స్ చేశారు, కాంగ్రెస్ సభ్యులను నిరంతరం సంప్రదించారు. ఈ లాబీయింగ్ వెనుక ఉన్నది ఒక వ్యక్తి ప్రయోజనం కాదు.. అమెరికాలోని భారతీయులకు పౌరసత్వం పొందే అవకాశం కల్పించాలనే లక్ష్యం.
లూస్–సెల్లర్ చట్టం.. 1946లో కీలక విజయం
ఈ పోరాటంలో అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు ఇమ్మాన్యుయెల్ సెల్లర్, క్లేర్ బూత్ లూస్ కీలకంగా నిలిచారు. వీరి సహకారంతో భారతీయులకు పౌరసత్వం కల్పించే చట్ట ప్రతిపాదన 1944లో ముందుకు వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో మద్దతు కూడగట్టేందుకు జేజే సింగ్ తన ప్రయత్నాలను కొనసాగించారు.
చివరకు 1946 జూలై 2న అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రూమన్ లూస్–సెల్లర్ చట్టం (Luce–Celler Act) పై సంతకం చేశారు. దీంతో భారతీయులు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం తెరుచుకుంది. అయితే, భారతదేశం నుంచి ఏడాదికి 100 మంది మాత్రమే వలస వెళ్లేందుకు ఈ చట్టం అనుమతించింది. అంటే, ఇది అన్ని వలస పరిమితులను తొలగించిన చట్టం కాదు. అయినప్పటికీ, భారతీయులకు పౌరసత్వం నిరాకరించిన పాత విధానంలో ముఖ్యమైన మార్పు తీసుకొచ్చింది.
చట్టంపై సంతకం చేసిన తర్వాత ట్రూమన్ తాను ఉపయోగించిన పెన్నును జేజే సింగ్‌కు అందించినట్లు కొన్ని చారిత్రక కథనాలు పేర్కొన్నాయి. ఆయన కృషికి గుర్తుగా చెప్పుకునే ఈ సంఘటన, ఆ చట్టం వెనుక సాగిన రాజకీయ ప్రయత్నాలను గుర్తు చేస్తుంది.
ఆ చట్టం నుంచి నేటి భారతీయ అమెరికన్ల వరకు
1946 చట్టం భారతీయుల వలసలను ఒక్కసారిగా పెంచలేదు. కానీ 1965లో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం రావడంతో పరిస్థితులు మరింత మారాయి. పాత జాతీయ మూలాల ఆధారిత కోటా విధానాన్ని తొలగించి, కుటుంబ పునరేకీకరణకు, నైపుణ్యం కలిగిన వలసదారులకు ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని అమెరికా ప్రవేశపెట్టింది.
తర్వాతి దశాబ్దాల్లో భారతీయులు విద్య, వైద్యం, సాంకేతిక రంగాలు, వ్యాపారాలు, రాజకీయాల్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు. నేడు అమెరికాలో భారతీయ మూలాలున్న ప్రజల సంఖ్య సుమారు 52 లక్షలని, వారిలో దాదాపు 26 లక్షల మంది ఓటు వేయడానికి అర్హులని కార్నెగీ ఎండోమెంట్ అంచనా పేర్కొంటోంది.
పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్ల ఓట్ల గురించి ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అయితే, వారంతా ఒకే రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తారని భావించడం సరికాదు. వారి అభిప్రాయాలు, సమస్యలు, రాజకీయ ప్రాధాన్యాలు భిన్నంగా ఉంటాయి.
జేజే సింగ్ వారసత్వం
జేజే సింగ్ 1959లో భారత్‌కు తిరిగి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. 1976లో మరణించారు. ఆయన మనవరాలు సబ్రినా సింగ్ మాత్రం అమెరికా రాజకీయాల్లో పనిచేశారు. 2016లో హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల ప్రచార బృందంలో ప్రాంతీయ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించగా, 2020లో కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత ఆమె ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు.
ఏదైమైనా…
ఈ రోజు అమెరికా ఎన్నికల్లో భారతీయుల ఓట్ల గురించి చర్చిస్తున్నప్పుడు, ఒకప్పుడు అదే దేశంలో పౌరసత్వం పొందేందుకు భారతీయులు పోరాడాల్సి వచ్చిందనే చరిత్రను మర్చిపోకూడదు. ఆ పోరాటంలో జేజే సింగ్ పేరు ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోతుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








