కొత్త రకం విడాకులు, యూత్ లో కొత్త ట్రెండ్!
పెళ్లయింది.. పిల్లలు పుట్టారు.. సొంతిల్లు ఉంది.. కుటుంబ బాధ్యతలన్నీ సవ్యంగానే సాగుతున్నాయి. పండుగలకు కలిసి ఫొటోలు దిగుతారు. బంధువుల ఇళ్లకు వెళ్తారు. బయటివాళ్లకు చూస్తే చక్కని కుటుంబంలాగే కనిపిస్తారు. కానీ ఇంట్లోకి వచ్చాక ఎవరి ప్రపంచం వారిదే! భార్యకు తన బాధలు భర్తతో చెప్పుకోవాలనిపించదు. భర్తకు తన విషయాలు భార్యతో పంచుకోవాలనే ఆసక్తి ఉండదు. గొడవలు లేవు.. అలకలు లేవు.. కానీ ప్రేమ, ఆప్యాయత కూడా ఉండవు. భారతీయ కుటుంబాల్లోనూ కనిపిస్తున్న ఇలాంటి పరిస్థితినే ‘క్వైట్ డివోర్స్’ (Quiet Divorce) అంటున్నారు.
విడాకులు తీసుకోకుండానే విడిపోయినట్టే!
మన సమాజంలో పెళ్లి బంధానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, కుటుంబ గౌరవం, బంధువులు ఏమనుకుంటారనే ఆలోచనతో చాలామంది తమ వైవాహిక సమస్యలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. బంధంలో సంతోషం లేకపోయినా సర్దుకుపోతుంటారు. కొందరు విడాకులు తీసుకోవాలనే ఆలోచన వచ్చినా ఆర్థిక పరిస్థితులు, పిల్లల బాధ్యతలు, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడి కారణంగా ఆ నిర్ణయం తీసుకోలేరు.
క్రమంగా భార్యాభర్తల మధ్య మాటలు తగ్గిపోతాయి. ఒకప్పుడు రోజంతా జరిగిన విషయాలు పంచుకునేవారు.. ఇప్పుడు పిల్లల స్కూలు, ఇంటి ఖర్చులు, కూరగాయలు, బిల్లుల గురించే మాట్లాడుకుంటారు. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ మనసులో ఏముందో చెప్పుకోవడానికి మాత్రం ఒకరికొకరు దూరమవుతారు. ఇలా ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు జీవితాలు గడపడం మొదలవుతుంది.
ఇవి కూడా చదవండి
గొడవలు లేకపోవడం సంతోషానికి సంకేతమేనా?
భార్యాభర్తలు గొడవపడటం లేదంటే వారి మధ్య అంతా బాగుందని అనుకోవడం సహజం. కానీ కొన్నిసార్లు గొడవలు తగ్గడానికి కారణం సమస్యలు పరిష్కారం కావడం కాదు.. వాటి గురించి మాట్లాడాలనే ఆసక్తి పూర్తిగా పోవడం కావచ్చు.
భాగస్వామి ఏం చేసినా పట్టించుకోకపోవడం, తన బాధలను చెప్పుకోవడం మానేయడం, ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఇప్పుడు తన జీవితంలో ఉన్నా పెద్దగా తేడా లేదనిపించడం.. ఇలాంటి మార్పులు కనిపిస్తే బంధంలో భావోద్వేగ దూరం పెరుగుతోందేమో ఆలోచించాలి. అయితే, ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించినంత మాత్రాన విడాకుల పరిస్థితి వచ్చిందని భావించకూడదు. అవి ఎందుకు ఏర్పడ్డాయో తెలుసుకోవడం ముఖ్యం.
బంధాన్ని మళ్లీ బాగు చేసుకోవచ్చా?
భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతోందని అనిపిస్తే ముందుగా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. నిందలు వేయకుండా తమకు ఏం బాధ కలిగిస్తోందో చెప్పాలి. కలిసి సమయం గడపడం, ఒకరి విషయాలను మరొకరు ఆసక్తిగా వినడం, ఇంటి బాధ్యతలను పంచుకోవడం వంటి చిన్న మార్పులు కూడా ఉపయోగపడవచ్చు. అవసరమైతే మ్యారేజ్ కౌన్సెలింగ్ సహాయం తీసుకోవచ్చు. అయితే, బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరూ ప్రయత్నించాలి.
పెళ్లి బంధం ముగిసిపోవడానికి ప్రతిసారీ పెద్ద గొడవ జరగాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మాటలు తగ్గుతాయి.. ఆశలు తగ్గుతాయి.. చివరకు ఒకరిపై మరొకరికి ఉన్న ఆసక్తి కూడా మాయమవుతుంది. బయటకు సంసారం సాఫీగా సాగుతున్నా, లోపల మాత్రం ఇద్దరూ ఒంటరిగా మిగిలిపోవచ్చు. అదే క్వైట్ డివోర్స్లో అసలైన విషాదం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








