60 వేల మందికి మైక్రోసాఫ్ట్ ఎగ్జిట్ ఆఫర్.. అసలు కారణం ఏమిటి?
ఏఐతో పని వేగం పెరుగుతోందనేది నిజం.. అదే సమయంలో ఉద్యోగుల సంఖ్య తగ్గించాల్సిన అవసరం వస్తోందా? టెక్ రంగంలో ఇప్పుడు ఇదే చర్చ. ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ అందుబాటులోకి తీసుకురావడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్‌లోనూ ఈ పథకం వర్తించే అవకాశం ఉండటంతో, మన లోకల్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్న ఆసక్తి నెలకొంది.
ఏమిటి ఈ ఎగ్జిట్ ఆఫర్!
ఉద్యోగులను తొలగిస్తున్నామని నేరుగా ప్రకటించడానికి బదులుగా, కంపెనీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలనుకునేవారికి అవకాశం కల్పించడమే ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ఉద్దేశం. అంటే, అర్హత ఉన్న ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టి తమ తదుపరి కెరీర్‌ను చూసుకోవాలనుకుంటే, అందుకు ఆర్థిక సహాయంతో కూడిన మార్గాన్ని మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. వినడానికి ఇదేదో ఉద్యోగుల ప్రయోజనం కోసమే తీసుకున్న నిర్ణయంలా అనిపించవచ్చు. కానీ, ఇలాంటి ఆఫర్ వెనుక కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలన్న లక్ష్యం కూడా ఉందన్నది గమనించాల్సిన విషయం.
ఏ ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది?
మైక్రోసాఫ్ట్ అంతర్గత ఉద్యోగ స్థాయుల విధానం ప్రకారం, లెవల్ 70 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఈ ఆఫర్‌కు అర్హులు. వయసు, కనీస సర్వీసు కాలం వంటి నిబంధనలు లేవు. అయితే కంపెనీలోని అన్ని విభాగాల ఉద్యోగులకూ ఈ అవకాశం వర్తించదు. సేల్స్, మార్కెటింగ్, సెక్యూరిటీతోపాటు కొన్ని నిర్దిష్ట ఇంజినీరింగ్ విభాగాలను మినహాయించారు. కోపైలట్, కోర్ ఏఐ, విండోస్ అండ్ డివైజెస్, ఎక్స్‌బాక్స్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి విభాగాల్లోని అర్హులైన ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.
మన వాళ్లపైనా ప్రభావం ఉంటుందా?
భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు సుమారు 23 వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఎక్కువమంది టెక్నాలజీ, ఇంజినీరింగ్, కార్పొరేట్ సపోర్ట్ విభాగాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్ కంపెనీకి అత్యంత కీలకమైన ఇంజినీరింగ్ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ 10 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం.
కోపైలట్, ఏఐ, క్లౌడ్ వంటి విభాగాల్లో భారత్‌లోనూ ఉద్యోగులు ఉన్నందున, తాజా ఆఫర్ ప్రభావం హైదరాబాద్‌పైనా ఉండే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఎంతమంది ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు? ఎంతమంది సంస్థను వీడేందుకు ముందుకొస్తారు? అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆఫర్ ప్రకటించినంత మాత్రాన హైదరాబాద్ కార్యాలయంలో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని చెప్పలేం.
లేఆఫ్‌లకు బదులుగా స్వచ్ఛంద నిష్క్రమణ
ఉద్యోగులను నేరుగా తొలగించడానికి బదులుగా, సంస్థ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలనుకునేవారికి అవకాశం కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ఆఫర్‌ను అంగీకరించే ఉద్యోగులకు కంపెనీ నిబంధనల ప్రకారం సెవరెన్స్ ప్యాకేజీ రూపంలో ఆర్థిక సహాయం అందుతుంది. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి, తదుపరి కెరీర్‌ను ప్రణాళిక చేసుకోవడానికి అవసరమైన వనరులను కూడా కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది.
అయితే, ఈ ఆఫర్‌ను ఎంచుకున్నవారికి వెంటనే మరో ఉద్యోగం దొరుకుతుందన్న హామీ ఉండదు. అందుకే కంపెనీ నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలతోపాటు, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అసలు కారణం ఏఐనా?
మైక్రోసాఫ్ట్ ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. కోపైలట్ వంటి సాధనాల వినియోగం పెరగడంతో కొన్ని పనులను తక్కువ సమయంలో పూర్తి చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా కొన్ని విభాగాల్లో తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని నిర్వహించే అవకాశం ఏర్పడుతోంది. అయితే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఏఐ ఒక్కటే కారణమని చెప్పలేం. వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులు, ఖర్చుల నియంత్రణ, కొత్త సాంకేతికతలపై పెట్టుబడులు కూడా దీనికి కారణాలు కావచ్చు.
మొత్తానికి….
మైక్రోసాఫ్ట్ తాజా ఎగ్జిట్ ఆఫర్ టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లోని ఉద్యోగులపై ఎంతవరకు ప్రభావం పడుతుందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఏఐ విస్తరిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాలను పెంచుకోవడం టెక్ ఉద్యోగులకు మరింత కీలకంగా మారుతోంది.
–సూర్య ప్రకాష్ జోశ్యుల








