ట్రంప్‌తో దోస్తీ చేసిన పెద్ద కంపెనీలకు గుబులు! అధికారం మారితే విచారణల మోతేనా?
అధికారం అండగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది.. కానీ అదే అధికారం చేజారితే? అమెరికాలో ట్రంప్‌కు దగ్గరై ప్రభుత్వ కాంట్రాక్టులు, రాజకీయ సంబంధాలు పెంచుకున్న కొన్ని టెక్, డిఫెన్స్ కంపెనీలను ఇప్పుడు ఇదే ప్రశ్న వెంటాడుతోంది. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు బలపడితే, తమ వ్యాపార ఒప్పందాలు, రాజకీయ విరాళాలపై విచారణలు మొదలవుతాయేమోనన్న భయం వాటిలో పెరుగుతోంది. దీంతో నిన్నటి వరకు ట్రంప్‌తో దోస్తీ చేసిన కంపెనీలు.. ఇప్పుడు డెమోక్రాట్లతోనూ సంబంధాలు పెంచుకునే పనిలో పడ్డాయని ది వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది.
పలంటీర్, ఓపెన్ఏఐ వంటి సంస్థలపై నిఘా?
ట్రంప్ ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉన్న పలంటీర్, ఓపెన్ఏఐ, మెటా వంటి సంస్థలపై డెమోక్రాట్లు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా AI టెక్నాలజీ, స్వయంచాలక ఆయుధాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో కంపెనీలు ఎంత పారదర్శకంగా వ్యవహరించాయన్నది కీలకంగా మారవచ్చు. డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో మెజారిటీ సాధిస్తే, విచారణల కోసం పత్రాలు కోరడం, కంపెనీల ప్రతినిధులను ప్రశ్నించడం వంటి చర్యలకు మరింత అవకాశం లభిస్తుంది.
ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్న కంపెనీలకూ చిక్కులు?
ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు సంబంధాలున్న పెట్టుబడి సంస్థ నుంచి నిధులు పొందిన కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఎలా వచ్చాయన్న అంశంపై ఇప్పటికే డెమోక్రటిక్ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, ట్రంప్ కుమారుల పెట్టుబడులు పొందిన 15 కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడులు, రుణాల రూపంలో మొత్తం 3.2 బిలియన్ డాలర్లు లభించాయి. వీటిలో ఎక్కువ భాగం ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాతే వచ్చాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ వివరాలు మాత్రమే అక్రమాలు జరిగినట్లు నిరూపించవు.
ఎలాన్ మస్క్‌తో పాటు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE)తో సంబంధాలున్న కంపెనీలపైనా పరిశీలన జరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందుబాటులోకి వచ్చిన సమాచారం, పరిచయాలను ఉపయోగించుకుని సంస్థలు ఆర్థిక ప్రయోజనాలు పొందాయా అన్నది విచారణల్లో కీలక అంశం కావచ్చు.
క్లీన్ చిట్ వచ్చినా నష్టమేనా?
విచారణలు ఎదుర్కొనే అవకాశం ఉందన్న భయంతో కొన్ని కంపెనీలు తమ బోర్డుల్లో డెమోక్రాట్లకు చోటు కల్పించడం, రాజకీయ పక్షపాతం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లు కథనం తెలిపింది. ఎందుకంటే విచారణలో తప్పు చేసినట్లు తేలకపోయినా కంపెనీల ప్రతిష్ఠ దెబ్బతినవచ్చు. పెట్టుబడులు, ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార భాగస్వామ్యాలపైనా ప్రభావం పడవచ్చు.
మొత్తానికి, ట్రంప్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్న కంపెనీలకు ఇప్పుడు రాజకీయ సమీకరణాల మార్పు కొత్త సవాలుగా మారుతోంది. అమెరికాలో అధికారం మారితే, ఈ సంస్థలు తమ రాజకీయ సంబంధాలనే కాదు.. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలనూ సమర్థించుకోవాల్సి రావచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








