హైదరాబాద్‌లో అమిత్ షా ‘మహా పాదయాత్ర’!
దేశంలో ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతపై రాజకీయ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం పనితీరును తప్పుపడుతూ కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండీ’ కూటమి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో, అధికార బీజేపీ దూకుడు పెంచింది. విపక్షాలు లేవనెత్తుతున్న ఆరోపణలను ప్రజల్లో ఎండగట్టడమే కాకుండా, వాటి వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను తిప్పికొట్టేందుకు బీజేపీ అధిష్ఠానం కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతిఘటన ర్యాలీలు, సభలు నిర్వహించాలని నిర్ణయించింది.
బీజేపీ రూపొందించిన దేశవ్యాప్త ఆందోళనల్లో హైదరాబాద్ కూడా భాగం కానుంది. నవంబర్ 2న నగరంలోని చారిత్రక ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ ‘మహా పాదయాత్ర’ చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ సన్నాహాలు చేస్తోంది. “లోక్తంత్ర బచావో – అరాచకత హటావో” అనే నినాదంతో సాగే ఈ పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరుకానున్నారు. కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కేంద్రంలో అధికారం, సంస్థాగత బలం ఉన్న బీజేపీ.. విపక్షాలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టడంలో అమిత్ షా శైలి భిన్నంగా ఉంటుంది. ప్రత్యర్థులు రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తున్నారని ఆరోపించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థల రక్షణ పేరిట ప్రజల్లో సానుభూతిని కూడగట్టడం బీజేపీ ప్రధాన వ్యూహం. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల ఆరోపణలు ఎన్నికల్లో ఓటమి భయంతో చేస్తున్నవేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
ట్యాంక్ బండ్ పరిసరాల్లో జరిగే ఈ మహా పాదయాత్రకు కనీసం లక్ష మంది కార్యకర్తలు, మద్దతుదారులను సమీకరించాలని హైకమాండ్ రాష్ట్ర శాఖకు స్పష్టమైన టార్గెట్ విధించింది. తెలంగాణ రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ జన సమీకరణ బీజేపీకి ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ప్రాంతీయంగా తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి బీజేపీకి ఇదొక శక్తివంతమైన వేదిక కానుంది.
ఈ భారీ సమీకరణ ద్వారా అటు జాతీయ స్థాయిలో విపక్షాల కూటమికి గట్టి సందేశం పంపడంతో పాటు, ఇటు రాష్ట్ర స్థాయిలో అధికార కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచవచ్చని బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వంటి కీలక ప్రాంతంలో లక్ష మందితో ప్రదర్శన నిర్వహించడం ద్వారా రాజకీయ మైలేజ్ సాధించవచ్చని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల శ్రేణులను సమాయత్తం చేసేందుకు కార్యాచరణ మొదలైంది.
ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి నిరసనలుగా మారుతుండటంతో, బీజేపీ కూడా ధీటుగా బదులిచ్చేందుకే సిద్ధమైంది. విపక్షాల విమర్శలను రక్షణాత్మక ధోరణిలో కాకుండా, దూకుడైన ఎదురుదాడితో ఎదుర్కోవాలన్నదే అమిత్ షా రాక వెనుక ఉన్న అసలు ఉద్దేశం. మొత్తంగా, ఎన్నికల కమిషన్ అంశం చుట్టూ దేశవ్యాప్తంగా మొదలైన ఈ రాజకీయ ఘర్షణ కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా రాష్ట్రాల రాజధానులకు పాకింది.








