తుమ్మిడిహట్టి గొడవేంటి?
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సాగునీటి ప్రాజెక్టుల అంశం కేంద్ర బిందువుగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి బ్యారేజ్ ను ప్రతిపాదించారు. తుమ్మడిహట్టి ఎత్తు పెంపు అంశం అప్పటి నుంచే వార్తల్లో ఉంటుోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి, దాని ప్రాధాన్యతను తగ్గించిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇప్పుడు అదే తుమ్మిడిహట్టికి జీవం పోసేందుకు ముంబై వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో 2008-09లో జలయజ్ఞం కింద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ను ప్రతిపాదించారు. అయితే, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు ముంపునకు గురవుతాయనే అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మడిహట్టి బ్యారేజ్ ఎత్తునిు 148 మీటర్లకు కుదించింది. అంతేకాక, మేడిగడ్డ రూపంలో ప్రాజెక్టు రూపురేఖలను మార్చేసింది. దీనివల్ల ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతాలు సాగునీటికి నోచుకోలేదని, కేవలం కింది స్థాయికే నీటిని మళ్లించారంటూ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రాజెక్టుల ప్రాధాన్యతను మార్చి, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని కాంగ్రెస్ వాదిస్తోంది.
గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలంటే 148 మీటర్ల ఎత్తు సరిపోదని, కనీసం 150 నుంచి 152 మీటర్లకు ఎత్తు పెంచితేనే ఆదిలాబాద్‌తో పాటు ఎండిన భూములకు నీరందుతుందని ప్రస్తుత ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అవుతోంది. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన చర్చలు, పుణేకు చెందిన కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రం అందించిన బ్యాక్‌వాటర్ అధ్యయన నివేదికలను మహారాష్ట్ర ముందు ఉంచుతోంది. ముంపు కేవలం 2,300 ఎకరాల లోపే ఉంటుందని, పైగా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల ఆయకట్టుకు ఇది జీవనాడిలా మారుతుందని మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.
ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ రగడకు దారితీశాయి. పదేళ్లలో రాష్ట్ర సాగునీటి రంగాన్ని సమూలంగా మార్చేశామని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. అయితే తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గింపు, మేడిగడ్డ కుంగిపోవడం లాంటి వాటిని కాంగ్రెస్ ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది. అంతేకాక.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు అనుమతులు ఇప్పించాల్సిందిగా కేంద్రంలోని బీజేపీని సైతం కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ప్రధాని మోడీకి లేఖలు రాయడం, కేంద్ర మంత్రులను కలవడం ద్వారా ఈ ప్రాజెక్టు సాధనలో తామే ప్రధాన పాత్ర పోషిస్తున్నామని చాటిచెప్పాలని కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. మొత్తంమీద.. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశం కేవలం నీటిపారుదల సమస్యకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది తెలంగాణలో పార్టీల మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారింది.








