ముంబైకి సీఎం రేవంత్.. తుమ్మడిహట్టిపై మహా సీఎంతో భేటీ!
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తుమ్మడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత పట్టుదలగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఎత్తును ప్రస్తుతమున్న 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచడం ద్వారా రాష్ట్రంలోని నీటి కొరత సమస్యకు శాశ్వత చెక్ పెట్టవచ్చనేది ఆయన ఆలోచన. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్తున్నారు. సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కీలక సమావేశం కానున్నారు.
మహారాష్ట్ర, తెలంగాణ మధ్య నీట ప్రాజెక్టులు, పంపకాలకు సంబంధించి వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎంతో రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తుమ్మడిహట్టి బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లకు పెంచడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది.
అయితే, ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచితే మహారాష్ట్రలో ముంపు ఏర్పడుతుంది. దీంతో అక్కడ ముంపునకు గురయ్యే భూములు, అక్కడి గిరిజన ప్రాంతాల ప్రజల ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. మహారాష్ట్రలో జరిగే భూసేకరణ భారాన్ని, ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పూర్తిగా తామే భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిపై పొరుగు రాష్ట్రం సానుకూలంగా స్పందిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆశిస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రాణహిత- చేవెళ్ల స్వరూపాన్ని మార్చి మేడిగడ్డ వద్ద బ్యారేజీలు కట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అవినీతి ఆరోపణలు, బ్యారేజీల కుంగుబాటు వంటి ఘటనలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మూలాలైన తుమ్మడిహట్టి వైపు దృష్టి సారించడం, ఎత్తు పెంపు ద్వారా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలని చూడటం ద్వారా తాము కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ప్రత్యామ్నాయంగా శాశ్వత సాగునీటి పరిష్కారాలు చూపుతున్నామని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.








