KCR: కేసీఆర్ ‘థర్డ్ ఫ్రంట్’ వ్యూహం?
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించబోతున్నారంటూ కేటీఆర్ చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలహీనపడుతోందని, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వైఫల్యాలు దేశంలో మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరాన్ని తెస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేస్తూ కీలక పాత్ర పోషిస్తారన్న సంకేతాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి.
కొంతకాలంగా జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కేంద్రంలో అధికార బీజేపీ సంకీర్ణ కూటమిపై ఆధారపడాల్సి వస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండీ’ కూటమిలో సమన్వయ లోపాలు బయటపడుతున్నాయి. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయం కోసం ప్రాంతీయ పార్టీలు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు కేసీఆర్ తన అనుభవం, జాతీయ రాజకీయాలపై ఉన్న పట్టును ఉపయోగించుకోవాలని వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రాంతీయ ఆత్మగౌరవ నినాదంతో ఇతర ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా తెరవెనుక కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
కేటీఆర్ చేసిన ఈ ప్రకటన వెనుక కేవలం ఢిల్లీ పీఠాన్ని ప్రభావితం చేయడమే కాదు.. తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కొంత నైరాశ్యంలో ఉన్న కేడర్‌ను ఉత్తేజపరచడానికి ఇదొక స్ట్రాటజీ అయి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో మళ్లీ చక్రం తిప్పుతారనే ప్రచారం మానసిక స్థైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. అలాగే, రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నినాదంతో శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే ప్లాన్ ఇది.
మొత్తంగా చూస్తే కేసీఆర్ రీ ఎంట్రీ ప్రచారం అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఎంతగా ఉపయోగపడుతుందో, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో ఆయన ఏ మేరకు సఫలమవుతారనేది రాబోయే రాజకీయ పరిణామాలు తేల్చనున్నాయి.








