అమెరికాలో తెలుగు యువతి మృతి
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా (Khammam District)లోని ఖమ్మం వర్తక సంఘం దిగుమతి శాక అధ్యక్షులు నల్లమల్ల ఆనంద్ కుమార్తె అక్షిత (Akshita) గుండెపోటుతో మృతి చెందారు. ఆమె న్యూయార్క్ (New York) ఆల్బనీ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎం.ఎస్ చదివేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె, సోదరుడు అక్షయతో కలిసి ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంటి వద్ద వాకింగ్ చేస్తూ తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సోదరుడు బయటకి వచ్చి చూడగా కింద పడిపోయి అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆస్పుత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అక్షిత మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న వర్తక సంఘం సభ్యులు, బంధుమిత్రులు నల్లమల్ల ఆనంద్ (Nallamalla Anand) కుటుంబాన్ని పరామర్శించారు. అక్షిత పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.








