ఏపీకి తుపాను ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ప్రస్తుతం తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ సుస్పష్టమైన అల్పపీడనం శనివారం రాత్రిలోపు వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడి, సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే బలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఈ తుపాను మరింత తీవ్రరూపం దాల్చి బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా మంగళవారం, బుధవారాల్లో తీరప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఈ సమయంలో తీరం వెంబడి అత్యంత బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
సముద్రం తీవ్ర అలజడిగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ, విపత్తుల సంస్థ కఠిన ఆదేశాలు జారీ చేశాయి. తీరప్రాంత మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి వదంతులను, ఫేక్ వార్తలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు వ్యాప్తి చేయవద్దని కోరారు. విపత్తుల సంస్థ, ఆర్టీజీఎస్ (RTGS) ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. తుపాను పరిణామాలను గమనించడానికి, అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.








