BJP: తెలంగాణలో బీజేపీ కొత్త స్కెచ్!
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. రాష్ట్రస్థాయి నేతలు తమ వంతు పోరాటం చేస్తున్నారు. అయితే ఇది సరిపోవట్లేదని పార్టీ హైకమాండ్ భావిస్తోందో ఏమో.. నేరుగా పార్టీ పెద్దలే రంగంలోకి దిగబోతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కొంత మేర డీలా పడింది. ఆ పార్టీకి అంతర్గత సమస్యలూ చుట్టుముట్టాయి. ప్రధాన ప్రతిపక్షంగా దూకుడు ప్రదర్శించాల్సిన గులాబీ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ శూన్యతను ఆసరాగా చేసుకుని, కాంగ్రెస్‌కు ఏకైక బలమైన ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవాలని బీజేపీ హైకమాండ్ గట్టిగా భావిస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, విద్యుత్ రంగ సవాళ్లు, రైతు రుణమాఫీ అమలులో సాంకేతిక లోపాలు, ఆరు గ్యారెంటీల అమలు తీరును బీజేపీ తీవ్రంగా ఎండగడుతోంది. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, ఈ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎన్నికల వరకూ వేచి చూడకుండా, రెండేళ్ల ముందే కేడర్‌ను సమరశంఖానికి సిద్ధం చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
నవంబర్‌లో హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఆయన పూర్తిగా సంస్థాగత ప్రక్షాళనపైనే దృష్టి పెడతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బూత్ స్థాయి కమిటీల పనితీరు, నాయకుల మధ్య సమన్వయం, సోషల్ మీడియా నెట్వర్క్ పటిష్టతపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలో అసమ్మతికి తావులేకుండా, క్షేత్రస్థాయిలో కష్టపడే సాధారణ కార్యకర్తలకు పెద్దపీట వేసేలా ఆయన నేరుగా బూత్ స్థాయి సైనికులకు మార్గదర్శనం చేయనున్నారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
డిసెంబర్లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా అత్యంత కీలకం కానుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు తదితర అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, కేంద్ర నిధుల వినియోగంపై స్పష్టతనివ్వడం ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది.
తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు లేకుండా, భవిష్యత్తులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ముఖాముఖి పోరును సృష్టించడమే బీజేపీ అసలు లక్ష్యంగా ఉంది. బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్‌కే మేలు జరుగుతుందనే ప్రచారాన్ని ప్రజల మెదళ్లలో నాటడం ద్వారా ఓట్ల చీలికను నివారించవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా ఢిల్లీ అగ్రనేతల వరుస పర్యటనలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి.








