అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్‌ను సెమీకండక్టర్ డిజైన్ (Semiconductor Design) రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, సామర్థ్యం పెంపుతో పాటు కృత్రిమ మేధ, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల విస్తరణ కోసం రూ.10,047 కోట్లతో కూడిన పలు ప్రతిపాదనలను సీఎం కేంద్రమంత్రి ముందుంచారు. విజయవాడ బైపాస్‌లైన్ (రూ.3,197 కోట్లు), కొవ్వూరు-భద్రాచలం రైల్వే ప్రాజెక్టు (రూ.2,860 కోట్లు), అనకాపల్లి-కొత్తవలస బైపాస్ ప్రాజెక్టు (రూ.2,190 కోట్లు), ఒంగోలు-దొనకొండ రైల్వే ప్రాజెక్టు (రూ.1,800 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అమరావతి-విశాఖ మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటుతో పాటు, విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైలును, పగటిపూట సీటింగ్ సౌకర్యంతో మరో రైలును నడపాలని సీఎం కోరగా కేంద్రమంత్రి అంగీకరించారు.
దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను ఆయన అధికార నివాసంలో కలిసి సుమారు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి పార్టీల సమన్వయం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. తమిళనాడు సీఎం విజయ్ ఇటీవల విజయవాడలో తనను కలిసినప్పుడు చర్చించిన గోదావరి కావేరి అనుసంధానం గురించి కూడా ప్రస్తావించినట్లు సమాచారం.
చంద్రబాబు ఈ సమావేశాల తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.








