సౌదీపైకి హుతీల కొత్త ఆయుధం.. ఎప్ స్టీన్ ఫైల్స్…!
సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది.ముఖ్యంగా.. సౌదీలోని మౌలిక సదుపాయాలను డ్రోన్లు, క్షిపణులతో టార్గెట్ చేస్తోన్న హూతీలు.. ఇప్పుడు కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. తమ ప్రత్యర్థిని అప్రతిష్టపాలు చేసేందుకు అమెరికాలోని సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్ పేరును వాడుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) నేరాలకు సంబంధించిన పలు పత్రాలను అమెరికా న్యాయశాఖ గతంలో విడుదల చేసింది. ఆ పత్రాలపై హుతీలు దృష్టిసారించారు. సౌదీ రాయల్ కోర్ట్‌కు చెందిన అనుచరులు.. అత్యంత పవిత్ర ప్రదేశంలో కప్పిన ఒక వస్త్రాన్ని ఎప్స్టీన్కు పంపినట్లు ఆ దస్త్రాలతో వెలుగులోకి వచ్చింది. ఈ పాయింట్ పట్టుకొని సౌదీ (Saudi Arabia)ని హూతీలు ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఆ దేశానికి వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వీడియోలు, పాటలు, ప్రసంగాల రూపంలోనే గాక, ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ల సోషల్ మీడియా ఖాతాల్లోనూ దీనిపై పోస్టులూ ప్రత్యక్షమవుతున్నాయి.
సౌదీ-హూతీల మధ్య కొన్నేళ్ల పాటు అమల్లో ఉన్న అప్రకటిత కాల్పుల విరమణకు కొన్ని నెలల క్రితం బ్రేక్ పడింది. దాంతో రెండు వర్గాల మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చాయి. పవిత్ర మక్కా నగరంపై ఆ రెబల్స్ గ్రూప్ దాడులకు యత్నించిందంటూ సౌదీ ఆరోపించింది. అయితే, దాన్ని హూతీలు (Houthis) ఖండించారు. ఆ పవిత్ర స్థలానికి సంబంధించిన వస్త్రాన్ని ఎప్స్టీన్కు ఇచ్చిన వారే (సౌదీని ఉద్దేశిస్తూ).. మక్కాపై దాడికి యత్నించారంటూ హూతీ గ్రూప్ అధ్యక్షుడు మహ్దీ అల్ మషత్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. మహ్దీ సందేశం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అయింది. యెమెన్ కమెడియన్ ఒకరు దీనిపై వీడియో చేశారు.
టీనేజ్ బాలికలను, యువతులను మోసపూరితంగా లొంగదీసుకొని జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) ఒక నేర నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులుగా చెలామణీ అయిన చాలా మంది ఆ అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. దానికి సంబంధించిన కొన్ని లక్షల ఫైళ్లను ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. ఎప్స్టీన్ 2019లో జైల్లో మరణించాడు. కానీ ఇప్పటికీ ఆ ఫైళ్లు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులను వణికిస్తూనే ఉన్నాయి.








